#1 1 కొరింధీయులకు 1 : 1-9
I కోరింథీ అధ్యయనం-1 -- కొరింథు లో ఉన్న సంఘము
జీవితమంటే ఇంత కష్టమనీ, ఇన్నిఇరుకు సమస్యలుంటాయనీ ఎవరూ ఎప్పుడూ చెప్పలేదు అనుకుంటున్నారా? మీరే, కాదు, మనమందరం ఎదుర్కుంటున్న కఠిన పరిస్థితులు మన సృష్టికర్త అయిన దేవుడు తన పరిశుద్ధ బైబిల్ గ్రంధంలో ఎప్పుడో రాయించి ఉంచారు, దేవుని మాటలు ఏమాత్రం మార్పు చెంద కుండా ఉండేలా అయనే భద్రపరిచాడు. ఒక్కసారి 34వ కీర్తన చదవండి, ఈ సత్యం అక్కడ ఎంతో విపులంగా ఉన్నది.
ఈ రోజు నుండి I కోరింథీ పత్రిక అధ్యయనాలు ఆరంభిస్తున్నాం. మీ తోటి విశ్వాసులు, పొరుగువారు, స్నేహితులకు తెలియచేయండి. వారితో బాటు మీ రేడియో అధ్యయనాలు వినండి.
ఆపో. పౌలు రోజుల్లో కోరింథీ పట్టణం చాలా పెద్ద వ్యాపార కేంద్రo. ఎంత పెద్దదో అంత దుష్టత్వము, పాపిష్టి, దుర్మార్గమైన పట్టణం. లెక్క లేని విగ్రహాలతో దేవాలయాలు ఉండేవి. కోరింథీ పట్టణములో అన్నింటికంటే ఎత్తైన పర్వతం ఉన్నది. దానిమీద పట్టణపు ప్రభుత్వముండేది, అక్కడే “ఆఫ్రోడైట్” అనే పేరుగల పోకిరి చేష్టల దేవతకు ఆలయముండేది, ఆ ఆలయమునకు అనుబంధంగా 1000 మంది దేవదాసిలతో విచ్చలవిడిగా వ్యభిచారం, పోకిరీ చేష్టలు జరగడానికి ఆ దేవతారాధనకు అది కేంద్రం.
పౌలు అధునాతనమైన ఏథెన్స్ పట్టణం నుండి కోరింథీకి వచ్చాడు. ఏథెన్స్ పట్టణం గొప్ప పేరు ప్రఖ్యాతులు చెందిన వేదాంతవేత్తలుండే పట్టణం. “మార్స్” కొండపైన పౌలు వీరిని ఎదిరించాడు. వీరితో ఏమాత్రం పొంతనలేని సమాజం, వేశ్యలతో కోరింథీ పట్టణం నిండి ఉన్నది. గమనించండి, ప్రియులారా, రెండు గుంపుల వారికి సువార్త సమానంగా అవసరం!
పౌలు భక్తుడు కోరింధీయులమధ్యలో ఉన్న సంఘపు సామూహిక ఆరాధనలో ఉన్న దుర్వినియోగమును సరిచేయుటకు ఈ పత్రిక వ్రాసాడని చాలామంది బైబిల్ వ్యాఖ్యాతలు అంటున్నారు, కానీ నేను వారితో విభేదిస్తాను. అలాగే కొందరు కోరింథీ పట్టణానికి మాత్రమే ఈ పత్రిక వర్తిస్తుందని చెప్పారు, వారితో కూడ విభేదిస్తున్నాము. ఎందుకంటే, జాగ్రతగా గమనించండి, కోరింథీ సంఘానికి వర్తించినవి అన్ని స్థలాల్లో వర్తిస్తాయని ఆయన ఆరు చోట్ల స్పష్టంగా చెప్పారు. పెన్ తో సిద్ధంగా ఉన్నవారు, ఈ రెఫరెన్స్ వ్రాసుకోండి, 1:2; 4:17; 7:17; 11:16; 14:33; 16:1.
సామూహిక ఆరాధనలో కొన్ని దోషాలున్నప్పటికీ, ఈ పత్రికలో ఉన్నదంతా అదే కాదుకదా!
పౌలు ఒక సంఘ స్థాపకుడు. ఆయన కోరింధులో ఒకటిన్నర సంవత్సరాలు గడిపాడు. కోరింథీ విశ్వాసులకు బోధించాలని ఆయన రెండు పత్రికలు వ్రాశాడు. కోరింథీ సంఘము విషయము, దాని సాక్ష్యము విషయము ఆయనకు భారమున్నది. ఆ. కా. 18:1-17లో కోరింధీలో సంఘము ఎలా ఆరంభమైందో వ్రాయబడింది. ఆయన ఏథెన్స్ నుండి ఇక్కడికి వచ్చినతరువాత, డేరాలు కుట్టే ఆకుల ప్రిస్కిల్లలు ఆయనతో జతకట్టారు. సబ్బాతు తరువాత సబ్బాతు దినాన, యూదులకు వినడానికి ఇష్టం లేనంతవరకు లేఖనాలవిషయం వాదించాడు. ఆ తరువాత సునగోగునకు ఆనుకున్న యాసోను ఇంట్లో ఉన్నప్పుడు యూదులు ఆయనను అకయ ప్రాంతపు అధికారంలో ఉన్న గలిలియో అనే చట్టసభకు ఈడ్చారు. ఆయన జనసమూహాలను గలిబిలి, గందరగోళం చేస్తున్నాడని ఆరోపించారు. కానీ న్యాయాధి కారి అది కొట్టివేశాడు.
కోరింథీ సంఘము ఆందోళనలమధ్య ఆరంభమైనా, అది ఆపో. పౌలు హృదయానికి ప్రియమైనది. ఈ పత్రిక ద్వారా మనము గమనించేదేమిటంటే, వారి మధ్యలో ఉన్నా, లేకున్నా, కోరింథీ విశ్వాసులకు సాదరంగా సేవచేయాలనే బలమైన కోరికతో ఉన్నాడు. కోరింథీ పత్రిక అధ్యయనాలు “కోరింథీ లో ఉన్న సంఘము” అనే ఈ మొదటి అధ్యయనంతో ఆరంభిద్దాం. లేఖన భాగము. I కోరింథీ 1:1-9
1 దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు యొక్క అపొ స్తలు డుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును
2 కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.
3 మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు కృపాసమా ధానములు మీకు కలుగును గాక.
4 క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
5 క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను,
6 అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్య వంతులైతిరి;
7 గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.
8 మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపర చును.
9 మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు.
కోరింథీ సంఘమునకు క్రీస్తుతో కొన్ని అత్యంత సన్నిహితమైన సంబంధములు ఉన్నవి. అవి ఈనాడు కూడా ప్రతి సంఘమునకు ఉండవలసిఉన్నది.
మొదటిది, విశ్వాసులు క్రీస్తులో పరిశుద్ధపరచబడ్డారు. 2వ వచనం. “కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువ బడినవారికిని,” పరిశుద్ధపరచబడ్డం మారుమనసులో ఒక భాగము. పరిశుద్ధపరచబడకుండా ఒక వ్యక్తి మారుమనసు పొందలేడు. మొదట మారుమనసు, తరువాత పరిశుద్ధపరచబడుట అని కొందరు భావిస్తారు, కానీ పరిశుద్ధలేఖనాలు పరిశుద్ధపరచబడుట మారుమనసులో ఒక భాగమని బోధిస్తు న్నాయి.
పరిశుద్ధపరచబడుట అంటే ప్రత్యేకించబడుట. ఒక వ్యక్తి మారుమనసు పొందినవ్యక్తి అయితే తప్పనిసరిగా ప్రత్యేకించబడతాడు. తాను పాపినని గ్రహించి యేసు క్రీస్తును తన రక్షకుడు, ప్రభువుగా స్వీకరించిన తరువాత దేవుని కుమారుడుగా జన్మిస్తాడు. మారు మనసుకు ముందు అతడు సైతాను కుమారుడు. యెసయ్య ఈ మాటలు యోహాను సువార్త 8:44లో సెలవిచ్చారు. పాపులందరూ సైతాను సంతానమే. ఒక వ్యక్తి మారుమనసు పొందినతరువాత, పైనుండి జన్మించినతరువాత, దేవుని కుమారుడవుతాడు. పౌలు ఈ విషయాన్ని రోమా. 8:16లో నిర్ధారించాడు. “మనము పిల్లలమైతే...క్రీస్తు తోడివారసులము.” కాబట్టి పరిశుద్ధపరచబడుట మారుమనసులో భాగమని స్పష్టం.
పాతనిబంధన ఆరాధనలో ప్రత్యేకపరచబడుటను చాలా గట్టిగా నొక్కి చెప్పారు. ఉదాహరణకు, సీనాయి అరణ్యంలో దేవుడు మోషేను కట్టమని చెప్పిన ప్రత్యక్ష గుడారము తీసుకోండి. అందులో మూడు భాగాలుండేవి: ఆవరణము, పరిశుద్ధస్థలము, అతిపరిశుధ్ధస్థలము. ఈ క్రమము దేవుడు పరిశుద్ధుడని ఇశ్రాయేలీయులు తెలుసుకోవడానికి వీలయ్యింది. పరిశుద్ధపరచబడుటను పలువురు పలు రీతులుగా అర్ధం చేసుకుంటారు, ఆచరిస్తారు. హస్తనిక్షేపణం చేస్తే పరిశుద్ధత అని కొందరు, చెప్పులు తీసివేస్తే పరిశుధ్ద్ధత అని మరి కొందరు, బాప్తిస్మము తీసుకొంటే పరిశుద్ధులు అని మరి కొందరు ఎవరికి తోచినట్టు వారు వాదిస్తుఉంటారు. కానీ పరిశుద్ధపరచబడుట అంటే పరిశుద్ధమైన ఉన్నతమైన దేవుని పిలుపు, పరిశుద్ధ ప్రామాణికతను అనుసరించడం.
రెండవ సంబంధం ఏమిటంటే విశ్వాసులు క్రీస్తునందు ఆత్మీయమైన ఐశ్వర్యవంతులు. 5వ వచనం. “మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్య వంతులైతిరి;” సోదరీ సోదరులారా, దేవుడు పైనుండి అనుగ్రహించే సమృద్ధియైన దేవుని కృపను జాగ్రతగా గ్రహించాలి. రోమా 5:20లో పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప కూడా అపరిమితముగా విస్తరించిందని పౌలు బోధించారు. రోమా పత్రిక అధ్యయనాల్లోనుండి జ్ఞాపకమొస్తుందా? ఈ కృప ప్రపంచ మంతటా అనేక దేశాల్లో జనములలో ప్రజల హృదయాలను తాకుతున్నది. దేవుని కృప యేసు ప్రభువు ద్వారా ఇవ్వబడుతున్నది. ఇది ఎవ్వరైనా, దేనిచేతనైనా సంపాదించుకోలేనటువంటి కృప. కారణమేమిటంటే మానవ హృదయము పాపిష్టిది. మనమంతా పాపాత్ములము. యిర్మీయా ప్రవక్త 17:9లో ఏమని బోధించాడో గమనించండి. ”హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధిగలది, దాని గ్రహింపగలవాడెవడు?” నోవహు ఓడలోనుండి నుండి బయటికి వచ్చినపుడే దేవుడది చెప్పాడు. ఆది. 8:21 చూడండి, “నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది.” అందువల్ల మానవ హృదయపు స్వభావమునకు దేవుని కృప అవసరము. క్రీస్తునకు బయట ఉంటే మనమంతా బిచ్చగాళ్ళమే. కానీ క్రీస్తులో ఉంటే మనమంతా ఐశ్వర్యవంతులం, హల్లెలూయ!
మనకేదీ కోదువ లేదు. 7వ వచనం ప్రత్యేకతను గమనించండి, “ఏ కృపావరమునందును లోపము లేక...” సమస్తమూ అందుబాటులో ఉన్నవి. దేవుడు సిద్ధపరచినవన్నీ మనము పొందవచ్చు. ప్రియులారా, మనము వెనుకంజ వేయక, క్రీస్తునందు ముందుకు సాగి, యేసు క్రీస్తు ప్రభువు రాకడ సమయమువరకు సంపూర్ణతను పొందడానికి ముందడుగు వేయుదముగాక! అమెన్!! మనమంతా ప్రభువు రాకడకోసం ఎదురు చూద్దాం, ఇదే క్రైస్తవ విశ్వాసులకందరికీ ప్రేరణ. ఇది పౌలు యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ప్రియులారా, క్రీస్తునందు ఐశ్వర్యవంతులు కావడం ఎంతో గొప్ప భాగ్యం కదూ!
మూడవ సంబంధం, విశ్వాసులకు యేసు క్రీస్తుతో సంబంధం ఉన్నది. 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు.” దేవుని నమ్మకత్వమును బట్టి, దుష్టులు, పోకిరీల సహవాసమునుండి కోరింథీ విశ్వాసులు క్రీస్తుతో సహవాసములోనికి పిలువబడ్డారు. ఒకప్పుడు వారు పాపమునకు బానిసలు. ఇప్పుడు యేసు క్రీస్తుతో సహవాసమున్నదని లేఖనము సెలవిస్తున్నది కదా! అదేమిటో లోతుగా పరిశీలిద్దాం. ఇప్పుడు వారు సంపూర్ణతలో, సమృద్ధిలో ఉన్నారు. క్రీస్తు లోకమును చూచినట్టు ఇప్పుడు వారు లోకమును చూస్తారు. క్రీస్తు సంఘర్షణ ఎదుర్కున్నట్టే వారు కూడా సంఘర్షణ ఎదుర్కుంటారు. క్రీస్తు ప్రభువు ఆశాభావంతో నిరీక్షణతో జీవించినట్టే వారుకూడా జీవిస్తారు. ఆయన చివరికి స్వాస్థ్యము పొందినట్టే వారుకూడా పొందుతారు. ఇది ఎంత గొప్ప ధన్యత! దేవునికి స్తోత్రం!
యేసు ప్రభువు వారు తండ్రికి చేసిన ప్రార్ధనలో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 17:5. “తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.” సోదరీ సోదరులారా, క్రీస్తు సహవాసములో మనకు కలిగే వాటిని గ్రహించటానికి ప్రయత్నం చేయండి. నీవు ఆయనతో ప్రతి దినం నడవచ్చు, జీవించవచ్చు. ఆయన సన్నిధిలో నీవు జీవించవచ్చు. ప్రస్తుతం నీవే పరిస్థితిలో ఉన్నా, నీవు ఆయనతో ఉండవచ్చు. నీకు సహాయం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నిన్ను భరించి, సంరక్షిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నిన్ను నడిపిస్తాడు.
ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి సంఘములాగానే, కోరింథీ లో ఉన్న సంఘమునకు శక్తిసామర్థ్యాలు ఉన్నవి. ఈ సంబంధo ఏ సంఘమైనా, ఎక్కడ ఉన్నా, సంఘాల్లో ఉన్న సభ్యులు కూడా అనుభవిస్తారు. సారాంశం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 1. విశ్వాసులు క్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డారు. 2. విశ్వాసులు క్రీస్తునందు, ఆత్మీయ ఐశ్వర్యవంతులయ్యారు, 3.విశ్వాసులు క్రీస్తులో సహవాసము కాలిగిఉన్నారు. ఈ సంబంధాలు నీవు, ప్రియ స్నేహితుడా, అనుభవించడానికి, మొదటి మెట్టు యేసు క్రీస్తు ప్రభువును నీ రక్షకునిగా నమ్మి స్వీకరించాలి. దీనికి బదులు ఇక ఏ మార్గము లేదు. యెసయ్యను స్వీకరించు, నీ జీవితంలోనికి, హృదయంలోనికి ఆహ్వానించు. దీనికి అవసరమైనంత మహా కృప ప్రభువు మీలో ప్రతి ఒక్కరికీ అనుగ్రహించుగాక! అమెన్!!