#11 1 కొరింధీయులకు 4 : 1-5
I కొరింథీ అధ్యయనం-11 4:1-5 -- భాధ్యతాయుతముగా ప్రవర్తించడం, జవాబుదారీతనం అనే నియమం
నిరాశలో క్రుంగి ఉన్నారా? నిరాశ ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయములో తప్పక కలుగుతుంది. అది మానవ జీవితములో ఒక భాగమే! ధైర్యము తెచ్చుకొని లేచి భోజనము చేసి ‘యేసయ్యా, నన్ను కరుణించు’ అని మీ మనసులోనే మొరపెట్టండి. ఆయనే ధైర్యం, నిబ్బరము కలిగించే నిరీక్షణకర్త. రోమా పత్రిక 15:13 మీ కిష్టమైనన్ని సార్లు చదివి, కంఠస్తo చేయండి. ఒక వేళ మీ నిరాశ ఇతరులకోసం కావచ్చు, మీ కుమారుడు, కుమార్తె, భార్య, భర్త, గురించి కావచ్చు. లూకా 6:35 చదివి, కంఠస్థం చేయండి.
ఆదాము హవ్వలు దేవుని ప్రశస్తమైన ఆజ్ఞను మీరి, ఘోరమైన తిరుగుబాటు చేసినపుడు హవ్వ తనభర్త మీదికి బాధ్యతను నెట్టేసింది, ఆదాము సాతాను మీదికి తోశాడు. మానవుల వ్యక్తిత్వములోనే బాధ్యతను ఇతరులమీదికి నెట్టివేయడం ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేస్తున్నపుడు మోషే సీనాయి కొండమీదనుండి వచ్చి ఎవరు దానికి బాధ్యులో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నపుడు అహరోను అతి సులభంగా ప్రజలమీదికి నెట్టివేశాడు. నిర్గమకాండము 32లో దీని వివరణ ఉన్నది. నిర్గమకాండము 32జవాబుదారీతనమంటే తాను చేసిన పనికి బాధ్యత తీసుకొని పాపమును ఒప్పుకోవడం. దావీదు రాజు బత్షెబతో వ్యభిచారం చేసినపుడు, దావీదు ఎంతో యుక్తిగా దాచిపెట్టిన పాపమును నాతాను ప్రవక్త బట్టబయలు చేశాడు. ఆయన అన్న మాటలు మూడే! “ఆ మనుష్యుడవు నీవే.” II సమూ. 12:7.
జవాబుదారీతనము అనే చట్టము గురించి I కోరింథీ 4:1-5 అధ్యయనం చేసి తెలుసుకుందాం. ఈ లేఖన భాగముద్వారా, దేవుని విశిష్టమైన అధికారమునుబట్టి, మనము జవాబుదారీతనమును ముఖాముఖి ఎదుర్కునేలా చేస్తుంది.
అలాంటి మొదటి విశిష్ట అధికారము దేవుని గ్రహించలేని మర్మములు. మొదటి రెండు వచనాలు గమనించండి. ““1. ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వా హకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. 2. మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.” దేవుని సేవకులు, బోధకులు, సంఘ కాపరులు ప్రత్యేకంగా చెడిపోవడానికి అవకాశముంటుంది. ఎందుకనగా వారు సంఘములలో నాయకులు. ఆపో. చెప్పినట్టుగా వారు దేవుని మర్మములకు గృహనిర్వాహకులు. బైబిల్ దినాల్లో గృహనిర్వాహకుడు అంటే ఒక ప్రత్యేకమైన బాధ్యత ఇవ్వబడిన సేవకుడు. అతడు యజమాని కాదు. కానీ ఆయన పనిచేసేవాడు, చేయించేవాడు. ఆదికాండములోని యోసేపు దానికి శ్రేష్టమైన ఉదాహరణ. ఫరో ఆయనను నియమించినపుడు, తన వద్ద ఉన్నవాటన్నిటి భాద్యతను ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే యోసేపు ఫరో స్థానములో దేశమంతటినీ నడిపించాడు. ఫరో సింహాసనము మీద కూర్చొనేవాడు, అంతే. గృహనిర్వాహకులు అత్యంత నమ్మకముగా ఉండాలి. 2వ వచనములో
“గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.” అనే విషయం చాలా ప్రాముఖ్యం. కానీ ఇక్కడ దేవుని గూఢమైన మర్మములవిషయములలో నమ్మకత్వము గురించి వ్రాయబడింది. దేవుని సేవకులైనవారు అటు ఇటు అలలు కొట్టుకున్నట్టుగా ఉంటారు. “తియాలజీ” తరతరానికి మారుతూ ఉన్నది. అప్పుడప్పుడూ తరం మధ్యలోనే మారటం గమనిస్తున్నాము. విశ్వాసముకంటే స్వంత ఆలోచనలు ఎక్కువగా ఉన్నవి. దేవుని వాక్యముకంటే బోధకుల మాటలు ఎక్కువ పట్టుకుంటారు. దేవుని సేవకులైనవారు దేవుని వాక్యమును గట్టిగా పట్టుకొని దాన్ని మట్టుకే బోధించాలి. కానీ చాలా చోట్ల జరుగుతున్నదేమిటంటే, దేవుని సేవకులు దేవుని వాక్యమును కించపరుస్తున్నారు. ఈ మర్మములు ఏమిటి, వాటి ప్రాముఖ్యత ఏమిటో మీరు తెలుసుకోవాలంటే, ఎఫెసీ. 3:1-7 వచనాలు అతి జాగ్రతగా చదివి ధ్యానించాలి.ఎఫెసీ. 3:1-7. దేవుని మర్మములు స్వంత శక్తితో తెలుసుకోలేనివి. దేవుడు ప్రత్యక్షపరిచి, బయలు పరిస్తే తప్ప వాటిని గ్రహించలేము. రోమా పత్రిక
11:33-36 వచనములలో దేవుని మర్మములు ఎంత గంభీరమైనవో ఆపో. పౌలు ఎంతో స్తుతిపూర్వకంగా వ్యక్తపరిచాడు. రోమా. 11:33-36 జాగ్రతగా చదివి, ధ్యానించండి. జవాబుదారీతనములోని మొదటి దేవుని విశిష్టమైన అధికారం, తెలుసుకోలేని దేవుని మర్మములు.
జవాబుదారీతనము విషయములో మనము ఎదుర్కునే రెండవ దేవుని విశిష్టమైన అధికారం, మనము గ్రహించలేని దేవుని మనసు. 3,4 వచనాలు గమనించండి. 3. మీ చేతనైనను, ఏ మనుష్యునిచేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను. 4. నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించు వాడు ప్రభువే.” మన మనసులు చాలా పరిమితమైనవి. మనము ‘తెలుసుకున్నదానికంటే ఎక్కువ తెలిస్తే బాగుండు’ అని అనుకుంటాం. కాని, అన్నీ మనము తెలుసుకునే అవకాశము, శక్తి మనకు లేదు. ఎవరికి తెలిసింది వారు సత్యం అనుకుంటారు, కానీ ప్రభువు తిరిగివచ్చే అంత్య దినము వచ్చినపుడు ఆయనను ఎలా ఎదుర్కోగలము? పరిస్థితులకు అనుగుణంగా తీర్మానాలు చేయడానికి అవి మనలను పురికొల్పుతాయి. కానీ ప్రియ శ్రోతలూ, పరిస్థితులనుబట్టి దేవుని వాక్యం మారదు. రోమా 2:1,2 వచనాల్లో దేవుని సత్యం, తీర్పు అందరిపట్ల, అన్ని పరిస్థితుల్లో మారదని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమా 2:1,2. దేవుని మనసు గ్రహింపనలవికానిది. ఆయన మార్పులేనివాడు. మలాకీ ప్రవక్త మాటలు ఈ సత్యమును తేటపరుస్తున్నాయి. మలాకీ 3:6: “ యెహోవానైన నేను మార్పులేనివాడను....” మలాకీ 3:6: కాబట్టి జవాబుదారీతనము విషయములో మనము ఎదుర్కునే రెండవ దేవుని విశిష్టమైన అధికారం, మనము గ్రహించలేని దేవుని మనసు.
ఇక దేవుని మూడవ విశిష్టమైన అధికారం, నిష్కళంకమైన దేవుని పద్ధతి. 5వ వచనం. “కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.” సమయానికి ముందు మనము తీర్పు చేయవద్దని ఆపో. హెచ్చరిక ఇస్తున్నాడు. దేవునికి తన కాలెండర్ ఉన్నది. ఆయన తన టైమ్ టేబుల్ ప్రకారం చేస్తాడు. ఏది ఎప్పుడు జరగాలో మనకెవరికీ తెలియదు, గాని సమస్తము ఆయన టైమ్ ప్రకారమే జరుగుతున్నవి. దేవుని క్యాలండర్లో సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. నిష్కళంకమైన దేవుని పద్ధతిలో క్రీస్తు ప్రభువు రెండవ రాకడకు కీలకమైన స్థానమున్నది. ఐదవ వచనములోని మాటలేమిటి? “సమయము రాకమునుపు” అంటే సమయమున్నట్టే గదా! సమయానికి, క్రీస్తు ప్రభువు రాకడకు సంబంధమున్నది. నిష్కళంకమైన దేవుని పద్ధతికి మన ప్రభువు యేసు రాకడకు సంబంధమున్నది. దీని విషయం పౌలు మనసులో ఏమాత్రం సందేహం లేదు. ప్రభువు తప్పక తిరిగి వస్తాడని ఆయన బోధిస్తున్నాడు. అప్పటివరకు వేచిఉండాలి.
నిష్కళంకమైన దేవుని పద్ధతి, ప్రతి క్రియను, ప్రతి ఒక్కరి క్రియను బహిర్గతం చేస్తుంది. “ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు,” అనే మాటల్లో ఏమి తెలుస్తుంది? దేవుని చూపులకు ఏవీ బయట ఉండవని బైబిల్ గ్రంధం మనకు బోధిస్తున్నది. హెబ్రీ 4:13 గమనించండి. “దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.” హెబ్రీ. 4:13 రహస్యములో మనము దాచుకున్న వాటినన్నిటినీ ప్రభువు బయటపెడతాడని ఆపో. పౌలు తేటగా బోధిస్తున్నాడు. మీ ప్రక్కలోనున్నవారి నుండి మీరు దాచిన తలంపులన్నిటినీ దేవుని దృష్టినుండి నీవు దాచలేవు. చివరకు మన హృదయాలలోని తలంపులు సైతం ప్రభువు బహిర్గతం చేస్తాడు. దేవుని విషయం నీవు తలంచే తలపులన్నీ ఆయనకు బాగా తెలుసు. అవి బయటపడే సమయం త్వరలో రానున్నది. మత్తయి సువార్త 20:1-15 లో ప్రభువు చెప్పిన ఉపమానమున్నది. ఒక్క గంట పనిచేసినవారికి, దినమంతా పని చేసినవారికి యజమానుడు ఒకే జీతము ఇవ్వటం అక్కడ గమనిస్తాము. ఇదేమి న్యాయమని దినమంతా కష్టపడి పనిచేసిన వారు యజమానుని అడిగినపుడు ఆయన అన్న మాటలు 14,15 వచనాల్లో జాగ్రతగా గమనించాలి: “నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది; నాకిష్టమువచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా?” దేవుని అపూర్వమైన అనంతమైన జ్ఞానము గ్రహించడం ఎవరి తరము? ఆయన నిష్కళంకమైన పద్ధతి గ్రహించడం మానవ జ్ఞానమునకు అందదు. మానవులు బయటికి కనిపించేవాటిని బట్టి మాట్లాడతారు. కానీ దేవుడు హృదయములోని యోచనలు, తలంపులను లెక్కలోకి తీసుకుంటాడు. వేషధారణను ఆయన బాగా గ్రహిస్తాడు. మనఃపూర్వకంగా చేసేవి ఆయనకు ముందే తెలుసు. పైకి కనిపించడానికి చేస్తున్నామా? హృదయములో నిజమైన ప్రేమతో చేస్తున్నామా? శ్రద్ధతో పరిచర్య చేస్తున్నామా? లేదా వృత్తిలాగా, జీవనోపాధి కోసం ఆయన సేవ చేస్తున్నామా? అది ఆయనకు తెలుసు. అన్నిటికీ అంత్య దినమున ఫలితము, జీతము ప్రభువే ఇస్తాడు. “ప్రతి వానికి మెప్పు దేవునివలన కలుగును” అనే ఈ మాటలు గమనించారా? అవును, అది మెప్పైనా, లేదా శిక్ష అయినా, ప్రభువే స్వయంగా ఇస్తాడు. కాబట్టి మనఃపూర్వకంగా, శ్రద్ధతో, యధార్ధంగా నీవున్న నీ కుటుంబంలోనైనా, నీవు పనిచేసే స్థలములోనైనా, వ్యాపారం చేసే చోటైనా, నీవు పరిచర్య చేస్తున్న సంఘములోనైనా, సంస్థలోనైనా, ప్రభువునకు లోబడి, ఆయన కన్నులకు సమస్తము కనిపిస్తున్నవని గ్రహించి, నమ్మి భయపడి, యేసు క్రీస్తు ప్రభువు మెప్పును మట్టుకే కోరుకొని దేవుని పరిశుద్ధ వాక్యపు వెలుగులో జీవించుటకు అవసరమైనంత మహా కృప ప్రభువే స్వయంగా మనకందరికీ సర్వసమృద్ధిగా అనుగ్రహించుగాక! అమెన్.