Hope Outreach & Living Hope


సజీవ నీరీక్షణ దైవ సందేశములు
Click on Play button to listen

 
 
Total visitors : 1080
Total views, this Message : 12

#20 రోమీయులకు 0 : Covid-19 Special

మనందరికీ సంబంధించిన ప్రాముఖ్యమైన విషయము గురించి ఈ రోజు మాట్లాడుకుందాం.
ఈనాటి మన అంశం కరోన వైరస్ లేదా కోవిడ్ -19 అనే వ్యాధి లేదా తెగులు

మనకు అర్ధం కావాలని వ్యాధి అని అంటున్నాము, కానీ దీనికి సరయిన పేరు తెగులు. వ్యాధికి తెగులుకు భేదమున్నది.
1. వ్యాదులు ఎన్నో ఉన్నవి: కానీ తెగుళ్లు కొన్ని మాత్రమే.
2. వ్యాధులు ఎల్లప్పుడూ ఉంటాటయి: తెగుళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి.
3. దాదాపు ప్రతి వ్యాధికి ఏదో ఒక విధమైన మందు లేదా ఔషధము ఉంటుంది. కానీ తెగులుకు ఔషధము లేదు. కానీ వాక్సిన్ లేదా టీకా మందు కనిపెడతారు.
4. అంటువ్యాధులు తప్ప, సాధారణమైన వ్యాదులు వ్యాపించవు : కానీ తెగుళ్లు విపరీతమైన వేగంగా వ్యాపిస్తాయి.
5. అన్ని వ్యాధులు ప్రాణాంతకములు కాదు: కానీ తెగుళ్లు ప్రాణాంతకములు, అంటే ప్రాణమును తేసివేస్తాయి.
ఈ విషయములను కరోన వైరస్ అనే తెగులుకు అన్వయించుకుంటే, ఇవన్నీ నిజమే అనిపిస్తుందా?

కరోన ధృవీకరించిన కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను: మొదటిది, సర్వ సృష్టి కర్త అయిన దేవుడు పరిశుద్ధ్ధుడు. ఆయన పాపమును శిక్షించే వాడు. మోషే కాలములో ఐగుప్తులోనికి ఆయన పంపిన తెగుళ్ళ విషయం మీకు తెలిసిఉండవచ్చు. దేవుడు పంపించిన తెగులు మళ్ళీ దేవుడే తీసివేశాడు, ఇతరులవల్ల కాలేదు. అవి దేవుని “తీర్పులు” అని పరిశుధ్ధ గ్రంధం బైబిల్ సెలవిస్తున్నది. ఇశ్రాఏలీయులను కూడా దేవుడు వారి ఆవిధేయతను బట్టి, ఆవిశ్వాసమును బట్టి, “మెడ వంచని”తనమును బట్టి కోపముతో తెగుళ్ళతో శిక్షించాడు. దేవునిలో పక్షపాతము లేదు. రోమా. 2:11. దేవుడు ఒక్కడే, ఆయన పరిశుద్ధతను ఎల్లప్పుడూ, ప్రతి సమయములో చాటుకుంటాడు. ప్రభువు తన పరిశుద్ధత విషయంలో రాజీపడడు. దేవుడు ఒక్కడే తన సృష్ఠి అంతటినీ ప్రభావితం చేయగలడు.

రెండవది, మనము కేవలము క్షణికులము మాత్రమే. మరో మాటలో చెప్పాలంటే, మరణము ఎప్పుడైనా, ఎవరికైనా, ఎలాగయిన కలుగవచ్చు. కరోన కావచ్చు, మరేదైనా అనారోగ్యం, ప్రమాదం, ఊహించనిది ఏదైనాజరగవచ్చు. అన్నీ సవ్యంగా సాగిపోతుంటే, మనము మంటివారమని మర్చిపోతూ విర్రవీగుతూ ఉంటాం. కరోన మనము క్షణికులమని జ్ఞాపకం చేసింది. పేద, ధనిక: పండితుడు, పామరుడు అంతా సమానమని దృవీకరించింది. దేశము, జాతి, రంగు, భాష, కులము, మతము అనే ఏ బేధము లేకుండా అందరికీ మరణం ఎంత అకస్మాత్తుగా సంభవించగలదో కరోన మనకు గుర్తు చేసింది.

మూడవది, కరోన యుగాంతమును సూచిస్తుంది. కరోన వచ్చిన తరువాత అందరిలో ఏమి జరుగబోతుంది అనే ఓ ప్రశ్న కలుగుతుంది. ఇది దేనికి సూచన అని అందరూ ఆలోచిడం మొదలు పెట్టారు. ఏ మందు లేనిది కరోన: అరికట్టడమొక్కటే మార్గము. దాని లక్షణాలు, పనిచేసే పధ్ధతి, వ్యాపించే పధ్ధతి, టీకా, ఇతర విషయాలు కనుక్కునేలోపే విపరీతంగా వ్యాపించింది. తన రెండవ రాకడ గురించి హెచ్చరిస్తున్న స్సందర్భములో ప్రభువు చెప్పిన మాటలు జాగ్రత్తగా అలకించండి: లూకా సువార్త 21:11. “మరియు ఆయన వారితో ఇట్లనెను: జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము లేచును; అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరువులును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాతములును గొప్ప సూచకములును పుట్టును.” ప్రియ స్నేహితుడా, సోదరీ, గమనించారా? సృష్టి కర్త అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా లోకమంతటికీ, అంటే, నీకు నాకు, ప్రతి ఒక్కరికీ, న్యాయతీర్పు చేయబోతున్నాడు. కనిపించే ప్రతి ఒక్కటీ నశించి పోయే సమయం త్వరలో వస్తున్నది. కరోన దానికి ఒక చిన్న సూచన. ఇంకా రాబోయే మహా శ్రమలు, తీర్పులు, తెగుళ్లు, ప్రకటన గ్రంధంలో స్పష్టo చేయబడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ లోకం, భూమి, ఆకాశము, పంచభూతాలు, నాశనము చేయబడి, దేవుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశములను సృష్టించి, తన రాజ్యము నిర్మిచ బోతూ ఉన్నాడు. దయచేసి మీ బైబిల్ తెరవండి. మీ వద్ద లేకపోయినట్లయితే తీసుకురండి. ఒక్క సారి, నాతో బాటు చదవండి: పేతురు వ్రాసిన రెండవ పత్రిక 3 వ అధ్యాయము, 8 వ వచనము నుండి చదువుకుందాం. మీరు కూడా నాతోబాటు, చదవండి: “ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములవలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు అలస్యమని ఎంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని యిచ్చయిoపక, అందరూ మారుమనస్సు పొందవలేనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతము గలవాడైయున్నాడు. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహా ధ్వనితో గతించిపోవును, భూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు, దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, భూతములు మహా వేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు ఆగమనము కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధ ప్రవర్తనతోనూ, భక్తితోను, ఎంతో జాగ్రత్తగల వారైయుండలెను. అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటియందు నీతి నివసించును.” ఇది భూమి ఆకాశముల భవిష్యత్తు. అనగా నీవు నేను ప్రతి దినము జీవించే భౌతిక జీవనానికి ఆధారము. ప్రభువు యేసుక్రీస్తు త్వరగా వస్తున్నారు! సిద్ధపడదామా? కరోన ఈ ప్రాముఖ్యమైన సత్యమును నిర్ధారిస్తున్నది.

ఇక కరోనాను మనము ఎలా ఎదుర్కోవాలి అనే విషయం ఆలోచిద్దాం. నిజమైన విశ్వాసి పరిశుద్ధ గ్రంధం బైబిలలోని సత్యములను గ్రహిస్తాడు గనుక ఇవి వింతగా అనిపించవు. మరోమాటలో చెప్పాలంటే వీటికోసం ఎదురు

చూస్తాడు. మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వీటి గురించి ముందే మనలను సిద్ధపరిచాడు. ప్రభువు ఒలీవల కొండ మీద శిష్యులకు చేసిన ప్రసంగము మత్తయి సువార్త 24 వ అధ్యాయము, మార్కు సువార్త 13 వ అధ్యాయము, లూకా సువార్త 21 వ అధ్యాయములలో ఉన్నది. జాగ్రత్తగా చదవండి, ధ్యానించండి. దేవుని యందు నిజమైన విశ్వాసము లేని వారికి ఇవి క్రొత్తగా, వింతగా, భయానకంగా ఉంటాయి. చాలా మంది యేసుక్రీస్తును రక్షకునిగా విశ్వసించరుగాని, ఒక మేలు చేసే వానిగా, కోరినది ఇచ్చే వానిగా భావిస్తారు. అది దేవుని వాక్యములో ఎక్కడా లేదు. ప్రభువులో జీవించడం ఒక అనుభవం, ఒక సంబంధం. అది ఒక పిలుపు. ఆ పిలుపుని విని, స్పందించి, పిలవబడిన చోటికి వచ్చి, పిలువబడిన పనిని చేసినవారే నిజమైన విశ్వాసులు. చిన్న పిల్లలు తాతయ్య, నానమ్మ దగ్గర ఏదో దొరుకుతుందని వచ్చినట్టు చాలామంది క్రైస్తవులు అని పిలవబడుతూ చలామణి అవుతున్నవారు, ఆరాధన స్థలమునకు వచ్చేది ఈ ఉద్దేశ్యముతోనే. ప్రియ సోదరీ సోదారులారా, కరోన మనలను మేలు కొలుపు తున్నది. దేవునితో నీ సంబంధo ఏమిటో, ఎందుకో, ఎలాంటిదో పరీక్షించుకోవాలి. లాక్ డౌన్ అందుకు చాలా మందికి అనుకూలంగా మారింది. ఆయనను వెంబడించే వారు లోకమునకు ఉప్పుగా, వెలుగుగా ఉండాలని ప్రభువు నిర్దేశించాడు. దానికిది మంచి సమయం కాదా? మన నిజమైన విశ్వాసమును చూపించే సమయమిదే! పరిసయులలాగా ప్రదర్శించుకోవడం కాదు, ప్రభువునకు నిజమైన శిష్యులుగా జీవించే మంచి అవకాశమిది! సాక్ష్య మిచ్చే అద్భుత సమయం! మన విశ్వాసమును, ధైర్యమును ప్రజలు చూచినపుడు, దేవునికి మహిమ కలుగుతుంది. ఆదిమ అపొస్తలులు, విశ్వాసులు, పరిశుద్ధాత్మ పూర్ణులై ధైర్యముతో, విశ్వాసముతో, ఐక్యతతో పరిశుద్ధతతో దీనమనసుతో దేవుని రాజ్యమే గురిగా జీవించారు, మరణించారు. వారేనాడు మరణమునకు భయపడలేదు. సోదరీ సోదారులారా, మన సంగతేమిటి?

మరి ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలి? భయము ఉన్నవారు జాగ్రత్తలు తీసుకుంటారు, మాకెందుకు? అనేవారు కొందరు ఉన్నారు. భయము లేని వారు జాగ్రత్తలు తీసుకుంటారా? అవును, ముమ్మాటికీ తీసుకోవాలి. దయచేసి జాగ్రత్తగా వినండి. కొన్ని ప్రత్యేకమైన పరిస్తితులలో, సందర్భాలలో ప్రభువు కొందరిని అద్భుతరీతిగా కాపాడాడు. మంచి ఉదాహరణలు: సింహాపు బోనులో దానియేలు, అగ్నిగుండంలో షడ్రకు, ఆయన స్నేహితులు. దీర్ఘంగా ఆలోచించండి, లోతుగా ధ్యానించండి. అవి ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు జరిగాయో గ్రహిస్తే మంచిది. విశ్వాసము ఉన్నపుడు జాగ్రత్తలు తెసుకోవాలా? తప్పనిసరిగా. అందరిలాగా మనము కూడా పనిచేసుకునే బ్రతుకుతామా? అవును. కానీ మనము చేసే పని దేవుని కోసము చేస్తూన్నమనే విశ్వాసముతో చేస్తాము. కొలస్సీ 3:22, 23 జాగ్రత్తగా చదివి, లోతుగా ధ్యానించండి. మనము కూడా అందరిలాగానే జీవించాలి, కానీ ప్రియమైన దేవుని పిల్లలగా జీవించాలి. జాగ్రత్త తీసుకోవడం అన్ని రీతులుగా మంచిది. బాధ్యత గలిగిన పౌరుడు, దేవుని కుమారుడు, లేదా కుమార్తె గా జీవిస్తున్నామన్నమాట! మరో ప్రాముఖ్యమైన విషయం: జాగ్రత్తలు తెసుకొనని వారు దేవునిని శోధిస్తున్నారు. మన ప్రభువు మత్తయి 4:7 లో సాతానుతో చెప్పిన మాటను గుర్తుంచుకోండి, “ప్రభువైన నీ దేవుని శోధింపవలదు”. జాగ్రత్తలు తీసుకోకుండా ఉండేవారు, నాకు కరోన రాదులే అనే నిర్లక్ష్యం చేస్తున్నవారన్న మాట. లేదా నన్నెందుకు దేవుడు కాపాడడు? అని దేవుని శోధించే వారన్న మాట.

జాగ్రత్తలు తీసుకోవటానికి మరో ప్రాముఖ్యమైన కారణము ఏమిటంటే మన అజాగ్రత్త వలన ఇతరులకు ఈ కరోన తెగులు సోకే ప్రమాదమున్నది. చాలా మందికి కరోనసోకి ఉండవచ్చు, కానీ లక్షణాలు కనిపించక పోవచ్చు. అలాంటి వారి ద్వారా వృద్ధులు, బలహీనులు, రోగనిరోధక శక్తిలేనివారు, దీర్ఘకాలిక అనారోగ్యం కలిగిన వారు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు కరోన బారిన పడవచ్చు. లేదా మీకు తెలియకుండానే, ఇతరులకు మీరు కరోనాను వ్యాపించేలా చేయవచ్చు.

కరోన వైరస్ వచ్చినప్పటినుండి ఎన్నో మార్పులు మన జీవన విధానంలో చేసుకుంటున్నాము కదూ! చేతులు కడుక్కోవలసిన విధానంలో కడుక్కుంటేనే మన చేతులకు మనకు తెలియకుండా అంటుకున్న ఈ భయానకమైన క్రిమినుండి మనం తప్పించుకోవచ్చు, ఇతరులను తప్పించవచ్చు. ఒక పరిశోధన ఏమి చెబుతున్నాడో విన్నప్పుడు నేను ఆశ్చర్య పడ్డాను. మనము సరియైన పధ్ధతి లో చేతులు కడిగినపుడు, మనకు తెలియకుండా మనలను అంటుకున్న కరోన క్రీమీయొక్క శక్తి తగ్గిపోతుంది, తెగులు శోకదు, ఇతరులకు ప్రాకదు. మాస్క్ పెట్టుకుంటేనే, మనము ఇతరుల తుంపరలనుండి తప్పించు కోవచ్చు. ఇతర మనుషులకు మనకు కనీసం రెండు గజాల దూరము ఉంటేనే మనకు భద్రత ఉంటుంది. వారికి మేలు చేసిన వారమవుతాము. ఇవన్నీ మనము తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు. ఇతరులు పాటించినా, పాటించక పోయినా, మీరు, నేను తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. నా మట్టుకు నేను ఇతరులు దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నపుడు, నేనే నాలుగు అడుగులు వెనుకకు వెళుతున్నాను. ముగింపులో, రోమా 8:31-39 చదవాలని ఆశ ఉన్నది, కానీ మీరు స్వయంగా చదవాలని కోరుతున్నాను. దేవుని అనంతమైన అసమానమైన మారని ప్రేమనుండి మనలను ఏది వేరు చేయదు. ఎంతో ప్రాముఖ్యమైన రోమా పత్రిక వచనo వెంబడి వచనo బైబిల్ సత్యాల పఠన ఆరంభిస్తున్నాము. మీ బైబిల్, నోట్ బుక్, పెన్ తెచ్చుకోవడం మరవకండి. మీ బంధువులు, స్నేహితులకు తెలియచేయండి.

ప్రార్ధించుకుందాం :


ప్రేమామూర్తివైన పరలోకపు తండ్రి, కరోన వైరస్ నీ ఆజ్ఞతోనే ఈ లోకానికి వచ్చింది. అది ఎందుకు వచ్చిందో, దాన్ని బట్టి మేము ఏమి నేర్చుకోవాలో తెలియచేసినందుకు వందనములు. బలమైన విశ్వాసము మీ వాక్యము ద్వారా పొందడానికి మాకు శ్రద్ధ పుట్టించoడి. కరోన అనే తెగులు నుండి మేము తప్పించుకోవడానికి, ఇతరులను తప్పించడానికి ప్రతి జాగ్రత్త తీసుకోవడo అవసరమని నేర్చుకున్నాం. డానికవసరమైన మీ కృప మాకందరికి విస్తరింప చేయమని, ప్రియ రక్షకుడు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రీ! ఆమెన్!!

మా వాట్సప్ నంబర్ :98 66 34 18 41.
మా టెలిఫోన్ నంబర్: 98663 41841.
ఇ-మెయిల్ అడ్రెస్: sajeevanireekshana@gmail.com
అడ్రెస్:
సజీవ నిరీక్షణ, పాస్టర్ విజయ్ భస్కర్ సింగపోగు,
3-125/6, ఎన్. ఐ. ఎన్. కాలనీ, బోడుప్పల్,
హైదరాబాద్-500092

మీ ప్రార్ధన అవసరతలు, మాకు తెలియచేయండి, మీ కోసం ప్రార్ధిస్తాము. రోమా పత్రిక నుండి ఇవ్వబడిన ఈ సందేశముల చిన్న పుస్తకము పొందాలని కోరినట్లయితే మమ్ములను వాట్సప్, లేదా, మెసేజ్ లేదా ఇ-మెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. సర్వశక్తి మంతుడైన దేవుడు మిమ్మును తన కృపతో దర్శించు గాక!