#42 రోమీయులకు 26 :
రోమా పత్రిక అధ్యయనం - 26 8:1-4 దేవుని ధర్మశాస్త్రమును తృప్తి పరచండం ఎలాగు?
జీవితం విచిత్రమైంది అనిపిస్తుంది కదూ! ఊహించని సంఘటనలు, తెలుసుకోలేని విషయాలు, అర్ధoకాని మనుషులు, బాధపెట్టే సమస్యలు, ఇంకా ఎన్నెన్నో... ఒక విషయం మాత్రం సత్యం. యేసు క్రీస్తు ప్రభువునకు సమస్తం తెలుసు, కాదు కాదు, ఆయన సమస్తమును ముందే నిర్ణయించి, జరిగించేవాడు. సర్వాధికారి, సర్వకృపానిధి, సర్వశక్తిమంతుడు. ఆయనకు తెలియకుండా నీకు జరుగుతున్నదీదీ లేదు. ఈ విషయం మత్తయి సువార్త 28:18 లో, ఇతర లేఖన భాగాల్లో కూడా స్పష్టంగా ఉన్నది. అందుచేత చింతచేయడం మాని, విశ్వాసమును ఆశ్రయించండి. దేవుని వాక్యము విశ్వాసమును పుట్టిస్తుంది. రoడి, మీ బైబిల్, నోట్ బుక్, పెన్ తెచ్చుకొని, రేడియొకు దగ్గరగా ప్రశాంతగా కూర్చొని, దేవుని వాక్యమును వినండి.
ఈనాటి మన అంశం: దేవుని ధర్మశాస్త్రమును తృప్తి పరచండం ఎలాగు? లేఖన భాగం ఆపో. పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 8:1-4 బైబిల్ తెరిచారా? రోమా 8:1-4
1 కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.
2 క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.
3 శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము
4 దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.
ఈ కొద్ది వచనాల్లో ఆపో. పౌలు దేవుని ధర్మశాస్త్రమును ఈ విధంగా నెరవేర్చగలమో బోధిస్తున్నాడు. కొన్ని చర్యలు మనము తీసుకున్నట్లయితే అది చేయగలము. అవేమిటో సావధానంగా తెలుసుకుందాం.
మొదటిది: మనము ఆత్మయందు జీవించాలని నిర్ణయించుకోవాలి. అనగా పరిశుద్ధాత్మ యందు జీవించాలని నిర్ణయించుకోవాలి. మనమంతా పాపులము అని చెప్పడములో ఏ సందేహము లేదు. మన స్వభావము, హృదయము, మనసు, అంతా పాప భూయిష్టమే, ఇది మన అందరి అనుభవమే. దేవుని వాక్కుకూడా దీన్ని రోమా 3:23లో నిర్ధారిస్తుంది. “ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు” ధర్మశాస్త్రము మన పాపమును బట్టి శిక్ష విధిస్తుంది.
ఆత్మయందు జీవించడం మనము ఎందుకు నిర్ణయించుకోవాలంటే, ఆయన, అనగా పరిశుద్ధాత్ముడు మనలను స్వతంత్రులుగా చేస్తాడు. శ్రోతలూ, జాగ్రతగా గమనించండి, పౌలు భక్తుడు ఆత్మ అని వ్రాస్తున్నపుడు, అది బోల్డ్ గా అనగా పెద్ద అక్షరాలతో వ్రాసినపుడు అది పరిశుద్ధాత్మునికి గుర్తు. ఈ నాడు పరిశుద్ధాత్ముణ్ణి గూర్చి అందరూ ఎవరికి తోచినట్టు వారు చెబుతున్నారు. లేఖనాలు ఏమి చెబుతున్నాయో అదే సత్యం. “ క్రీస్తు యేసునందు జీవమునిచ్చుఆత్మ” అనే మాటలు గమనించారా? యేసుప్రభువుతో వ్యక్తిగత సంబంధం కలిగినవారు మాత్రమే ఆయనయందు జీవిస్తారు. అలాంటి వారికి పరిశుద్ధాత్ముడు జీవమునిస్తాడు, స్వాతంత్రము నిస్తాడు. ఆత్మననుసరించి జీవించడం అంటే ఏమిటి?
పరిశుధ్దాత్మ ననుసరించి జీవించే వారిలో కొన్ని రుజువులు కనిపిస్తూఉంటాయి.
1. వారు పాపమునకు దూరముగా జీవించాలని అన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తెలియపరచబడిన దేవుని ప్రత్యక్షతకు వ్యతిరేకంగా జీవించడం పాపము. అది పరిశుద్ధ గ్రంధం బైబిల్లో గుప్తమైఉంది. యేసు క్రీస్తును నీవు నీ హృదయంలో కలిగిఉన్నపుడు, ఆయన నీ పాపమoతటినీ తీసుకొంటాడు, తన జీవం నీకిస్తాడు. అది ఒక మార్పిడిజరిగే అనుభవము. అంచేత ఇప్పుడే సిలువ చెంతకు వెళ్ళి నీ పాపమoతటినీ ఒప్పుకో, ఆయన నీకు దానికి బదులుగా పరిశుద్ధాత్మ ద్వారా తనజీవమిస్తాడు.
2. అపోహలను వారు విడిచిపెట్టి నిజమైన ఆత్మ శక్తితో జీవిస్తారు. దేవుని అత్యంత పరిశుద్ధ ప్రమాణాలకు మనము చేసే ఏవి కూడా సరితూగవు. ఏ నీతి కార్యాల ద్వారా, ఏ స్వంత ప్రయత్నముచేత నీవు, నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందలేవు. ఆయనను తృప్తిపరచలేవు. మనచుట్టూ అపోహలను సత్యమన్నట్టు బోధిస్తూ, చూపిస్తూ, మభ్యపెట్టే వారు ఉన్నారు. మోసపోకండి, దేవుని వాక్యమును తెలుసుకొనండి.
3. ఆత్మలో జీవించడమంటే, దేవుని వాక్యములో, వాక్యప్రకారము జీవించడమే! వాక్యమే “శరీరధారి”గా యేసుక్రీస్తుగా జీవిస్తున్నాడు. ఆయన తన నోటి ఊపిరి చేత అనుగ్రహించిన వాక్యములో నీవు సంపూర్ణంగా నింపబడినపుడు ఆయన జీవము, ఊపిరి నీలో నిండుతుంది.
4. పరిశుధ్ద్ధాత్ముడు యేసు క్రీస్తు ప్రభువు గురించి మాట్లాడుతాడు, ఆయనను ఘనపరుస్తాడు. ఆత్మలో జీవించేవారు యేసు క్రీస్తు ప్రభువు వెలుగువైపే వెళ్లాలని మిక్కుటమైన, బలమైన కోరికతో జీవిస్తారు. ఆయన వెలుగు కృప ప్రేమలతో నిండివుంటుంది.
5. ఆత్మలో జీవించేవారు ప్రార్థన ద్వారా, క్రీస్తువారిపైన పూర్తిగా ఆధారపడతారు. ప్రభువుదగ్గర విచారణ చేయకుండా ఒక్క అడుగు వేయరు, ఒక్క తీర్మానం తీసుకోరు. అడుగడుగునా ఆయనపైనా ఆధారపడి జీవిస్తారు.
ఈ రుజువులు మనలో కనిపిస్తున్నాయా? పరీక్షించుకుందాం.
రెండవది, క్రీస్తు మార్గములో మనము ఆనందముతో పండుగలాగా సంతోషించాలి. శ్రోతలూ, గమనించండి. సహజసిద్ధంగా మనము పాపపు బానిసత్వములో ఉన్నాము. దాని ఫలితం మరణము. శరీర నియమము మన పాపపు స్వభావములో ఉన్నది. ఆపో. “శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు..’అని 3వ వచనములో అంటున్నపుడు అర్ధం ఏమిటి? శరీర స్వభావము ప్రకారము కాదుగానీ, పరిశ్ద్ధాత్ముడు నడిపించే మార్గములో మనము నడవాలి. గ్రీక్ భాషలో నడచుట అనే మాటకు, జీవించుట అనే మాటకు ఒకటే మాట వాడారు. ఇది క్రొత్త మార్గము. యేసు క్రీస్తు ప్రభువునకు చెందిన ఈ మార్గములో జీవముంటుంది. శరీర స్వభావపు మార్గములో మరణం ఎంత ఖచ్చితమూ, క్రీస్తు యొక్క క్రొత్త మార్గములో జీవము అంతే ఖచ్చితం. పాపమునకు ఫలితముగా మరణము ఎలాగు తప్పనిసరిగా ఉంటుందో, అలాగే యేసుక్రీస్తునందు ఆత్మద్వారా జీవించినపుడు జీవము తప్పనిసరిగా కలుగుతుంది.
2వ వచనములో ఉన్న మహా బలమైన సత్యమును మనము గ్రహించాలి. “క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను.” ఈ సత్యమును మహా సంతోషముతో ఆస్వాదించండి. క్రీస్తు మార్గము విశ్వాసులను ఉన్నత స్థానములో ఉంచుతుంది. పాపపు మరణపు నియమము, లేదా చట్టమునుండి మనలను యేసుక్రీస్తు నందు నిలువబెట్టడానికి మనకు గొప్ప విడుదల కలిగింది. ఇది మీరు గ్రహించారా? అనుభవిస్తున్నారా?
మూడవది, దేవుని క్రియను మనము హక్కులాగా స్వంతం చేసుకోవాలి. మనము అసాధ్యం అనుకునేవి దేవునికి సాధ్యం. ధర్మశాస్త్రం మననుండి ఆశించేవి కటినమైనవి, వాటిని మనము చేయలేదు, కానీ ప్రభువు తన అద్భుతశక్తి చేత మనము చేయలేనివి చేయడానికి కృప కలిగిస్తాడు. ధర్మశాస్త్రము నిర్దేశించింది మన పాపపు స్వభావమును బట్టి చేయలేకపోయాము. అప్పుడు దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తు ప్రభువును మనలాంటి శరీరముతో పంపించి, మన పాపమునకు రావలసిన శిక్షను ఆయనమీద మోపాడు. గమనించండి, శ్రోతలూ, యేసు క్రీస్తు ప్రభువు ధరించింది మనలాంటి శరీరమే కానీ, పాపములేని శరీరము. మనంతట మనము ధర్మశాస్త్రపు విధిని నెరవేర్చలేము. అందుచేత, తండ్రియైన దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు మరణ, పునరుద్ధ్ధానముల ద్వారా మన పక్షంగా నెరవేర్చాడు. నీవు నేను, యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా, ఆయనలో జీవించినపుడు, మనము ధర్మశాస్త్రము నెరవేర్చిన వారమవుతాము. ఇదొక్కటే, ధర్మశాస్త్రమును నెరవేర్చి తృప్తి పరిచే మార్గము. ఆయన మరణించింది, మనము జీవించడానికి, ఆయన కోసం జీవించడానికి. నీవు సిధ్ధమా? ఆయనకోసం జీవించాడానికి, పరిశుద్ధాత్ముడు మనకందరికీ సహాయము చేయుగాక!