#52 రోమీయులకు 36 :
రోమా పత్రిక అధ్యయనం-36 10:1-4
ధర్మశాస్త్రపు గురి ఏమిటి?
మీరoదరూ బాగున్నారా? తప్పనిసరిగా మనమంతా అంత్యదినములలో జీవిస్తున్నాము. ప్రవచనములన్నీ నెరవేరుతూఉన్నాయి. మన ప్రభువు రెండవ రాకడకు చెప్పిన గుర్తులు నెరవేరుతూ వస్తూఉన్నాయి. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకూడదు. జాగ్రత వహించి, శ్రమలు సహించి, అంతము వరకు సహించవలసిన హెచ్చరికలు మనకు ప్రభువే స్వయంగా ఇచ్చాడు గదా! అంతము వరకు సహించడానికి ఎంత ఓపిక, సహనం, ధైర్యం, విశ్వాసం అవసరమో మీకు మీ స్వంత జీవన యాత్రలో అర్ధం అయిఉండాలి. దేవుని వాక్య అధ్యయనం ద్వారా, ఇవన్నీ మనము పొందవచ్చు. మరోమాట! మీకు దేవుని వాక్యం ఏ విధంగా ఏ విషయంలో మేలు చేస్తుందో స్పష్టంగా చెప్పండి. సరిగ్గా ఏది మీ హృదయాన్ని తాకుతుందో అది తెలపడo నిజమైన స్పందన. అదే నిజమైన సాక్ష్యం! ప్రార్ధన చేసి అధ్యయనం చేసుకుందాం.
గురిలేకుండా జీవించే వారిని చూశారా? ఏ గురి లేకుండా జీవించడం దౌర్భాగ్యమే. గురి ఉన్నందుచేత ఎంతవరకు చేరుకున్నామో, ఇంకెంత చేయవలసి ఉందో అర్థమవుతుంది. అవునా? దేవునికి తన ధర్మశాస్త్రము విషయములో గురి ఉంది. ఆపో. పౌలు లేఖనాల్లో విద్యాభాసం చేయడమే కాకుండా, పరిశుధ్ద్ధాత్ముని బోధలో 2 సం|| శిక్షణ పొందాడు. దానివలన ప్రభువు ఆయనకు అప్పగించే పరిచర్యకోసం శిక్షణ పొందాడు.
ఈనాటి మన అంశం ధర్మశాస్త్రపు గురి ఏమిటి? క్రొత్త నిబంధనలోని భక్తులలో పౌలు కంటే ఎక్కువగా దానిగురించి తెలిసినవారు లేరు. రోమా పత్రిక 10:1-4 చదివి జాగ్రతగా అధ్యయనం చేస్తే అదేమిటో మనకు అర్ధం అవుతుంది. మీ బైబిల్ తెరిచి గమనించండి: క్రొత్త నిబంధనలో 140 పేజ్
1. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణపొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై యున్నవి.
2. వారు దేవుని యందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.
3. ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు.
4. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు.
ఈ బోధలోని కొన్ని మాటలను విపులంగా ధ్యానించి అధ్యయనం చేస్తే తప్ప ధర్మశాస్త్రపు గురి ఏమిటో మనకు బోధపడదు.
మొదటిది, దేవుని ధర్మశాస్త్రమునకు కలిగే స్పOదనలలో ఒకటి దేవునికోసం ఆసక్తి. మనలో కొన్నిటి కోసం ఆసక్తి, ఉత్సాహం ఉంటుంది. అది అంతరంగంలో ఉండే ఆరాటం, భారం. ఎందుకు మనకు ఆ ఆరాటం ఉందో స్పష్టంగా ప్రతి సందర్భంలో చెప్పలేకపోయినా, ఆ ఆరాటం, భారం, మనలను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆపో.పౌలు తన సమకాలీనప్రజలు ఇశ్రాయేలీయుయలకు దేవునిపట్ల ఎంతో ఆసక్తి ఉన్నదని తెలుపుతున్నాడు. కానీ వారి ఆసక్తి అనుభవపూర్వకమైనది కాదని కూడా గ్రహించాడు. మరో మాటలో చెప్పాలంటే తప్పుడు గురివైపు ఆ ఆసక్తి నడిపించింది. అది అపోహలపై ఆధారపడిన ఆరాటం. ఏది చేయాలని వారికి తోచిందో, అది చేశారు. కానీ ఏది దేవుడు చేయాలని నిర్దేశించాడో దాన్ని సరిగ్గా గ్రహించ లేదు, అది వారు చేయలేదు. సోదరీ, సోదరులారా, మీ గురి ఏమిటి?
కానీ కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే, అది వారు తెలుసుకోవలసిన అగత్యత ఉంది! ఎందుకంటే వారికి దేవుడు పాత నిబంధనను అనుగ్రహించాడు. మోషే పంచ గ్రంధాలు, ప్రవక్తల ప్రవచన గ్రంధాలు దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని మాటలు తలలో, మెదడులో ఉండవచ్చేమో కానీ వాటిని హృదయంలో అనుభవించక పోయి ఉండవచ్చు. వారికి అలాంటి జ్ఞానము ఉండింది. Head Knowledge అంటారు. వారికి మోషే ఏమి సెలవిచ్చాడో తెలుసు, ప్రవక్తలు ప్రవచనాల్లో ఏమి వ్రాశారో తెలుసు. కానీ వాటిని శారీరిక స్వభావము లేదా పాపస్వభావపు మనసుతో గ్రహించారే తప్ప పరిశుధ్ద్ధాత్ముడు నడిపించిన మార్గములో కాదు. పరిశుధ్ద్ధాత్ముని నడిపింపు, కృప లేకుండా కేవలం ఆసక్తితో ఏమి చేసినా అంతా నిష్ప్రయోజనమే. ఆలాంటి ఆరాటం, భారం నీవెరుగని చోటికి నిన్ను తీసుకెళ్తుంది. ఆసక్తికి గురి ఉండాలి. ఇది ప్రాముఖ్యమైన సంగతి.
రెండవది, ధర్మశాస్త్రములో దేవుని నీతి నిర్వచించబడింది. దేవుని నీతి పరిపూర్ణమైనది. దేవునిలో అవినీతి, ఇసుమంత కూడా లేదు. చిన్న నలుసుకూడా లేదు. దేవునిలో ఎలాంటి మార్పు గాని, ఎలాంటి నీడ గాని, చీకటి గాని లేదు. ఆయన ఎల్లప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. ఆయన మార్పులేనివాడు గనుకనే మానవాళి ఇంకా నశించిపోలేదు. దేవుని నీతి ఎంత ప్రత్యేకంగా విశిష్టమైనదంటే, మన స్వనీతి ఆయన యెదుట మురికి పేలికలే. దేవుని నీతి ముందు స్వనీతికి స్థానం లేదు, నిలువనేరదు. కారణo? దేవుని నీతి సంపూర్ణమైనది. పరిపూర్ణమైనది, విశిష్టమైనది. కానీ ఆపో. ఏమంటున్నాడు? “వారు దేవుని నీతి నెరుగ” లేదు. అందుచేత వారు తమ స్వంత స్వనీతిని చూపించి నిలబడాలనుకున్నారు. శ్రోతలూ, గమనిస్తున్నారా? అది అసాధ్యం. పరిపూర్ణంగా నీతిమంతుడైన దేవుని సన్నిధిలో నీ స్వనీతిని చూపించుకోలేవు.
ఇశ్రాయేలీయులు వారి స్వనీతిని చూపించుకోవాలని ప్రయత్నించి, దేవుని నీతికి లోబడలేదు, విధేయత చూపలేదు. నీవు, నేను దేవుని పరిపూర్ణ నీతిని గ్రహించినపుడు మనము ఆయన పద్ధతి, ఆయన మార్గములో నడవడానికి తగ్గించుకోవాలి. ఎందుకనగా ఆయన సన్నిధిలో నీవైన, నేనైనా, మన నీతి అంతా మురికిగుడ్డ పేలికలే. దేవుని నీతికి ఏది సరితూగదు, సాటిలేదు. సోదరీ సోదరులారా, అందరిలో దేవుడే ఒక్కడే పరిపూర్ణ నీతిమంతుడుగా నిలిచిఉంటాడు. ఎవ్వరితో పోల్చడానికి వీలులేదు.
మూడవది, దేవుని నీతిని నెరవేర్చడానికి ఆయనే ఏర్పాటు చేశాడు. నాలుగవ వచనం చాలా చాలా ప్రాముఖ్యమైనది. “ విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు.” ఈ వచనమును మనము కొంచెము లోతుగా ద్యానిద్దాం. దేవుడు చేసిన ఈ ఏర్పాటు నిత్యత్వమునoదే దేవుని మనసులో ఉన్నది. దేవుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా తప్ప ఎవ్వరినీ, ఎప్పుడైనా, వేరే ఏ మార్గములో నీతిమంతుడుగా తీర్చాలని ఉద్దేశించలేదు. ఆయన చరిత్రలో దీన్ని తన స్వంత ప్రణాళిక ప్రకారం, తన స్వంత సంకల్పం ప్రకారం నెరవేర్చాడు. మనకది ఎంతో టైమ్ పట్టినట్టు అనిపించవచ్చు. కానీ మనము గమనించవలసింది ఏమిటంటే, దేవుడు కాలమునకు పరిమితుడు ఎన్నడూ కాదు. ఎందుకనగా ఆయన అన్నిటినీ తన చిత్తం ప్రకారం చేస్తాడు.
పాత నిబంధన లోని లేఖనాలు మన మేలు కోసం, ఆత్మీయ ఎదుగుదల కోసం ఉన్నవి. వాటిని మనం చదివి వాటి ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. దేవుని నిత్యమైన మనసులో తాను వేసుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని క్రియలు జరిగిస్తాడని మనము గమనించి, గ్రహించాలి. ఆ ప్రణాళిక చరిత్రలో నెరవేర్చాడు. కాబట్టి, దేవుని నిత్య ప్రణాళిక ప్రకారం మనము యేసుక్రీస్తు రక్షకుని ద్వారా నీతిని పొందాలి.
విశ్వసించే ప్రతి ఒక్కరికీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీతి ననుగ్రహించడం ధర్మశాస్త్రపు గురి. సోదరీ, సోదారులారా, ఈ విషయం మనమందరం జాగ్రత్తగా క్షుణ్ణంగా గ్రహించాలి. ధర్మశాస్త్రమునకు వేరే గురి లేదు. వేరే గురి వైపు ధర్మశాస్త్రము పయనించదు. ధర్మశాస్త్రము నీయంతట నీవే నీతిమంతుడివి కాలేవు అని ఘోషిస్తూఉన్నది. దేవుడు పాతనిబంధన కాలములో బలులు చేయమని అజ్ఞాపించింది యూదులు నీతిమంతులు కాదు అని నేర్పించడానికి. వారు నీతిని పొందలేకపోయినందుచేత వారి స్వంత మార్గములో నీతిని సంపాదించుకోవడం కోసం ఆరాటపడ్డారు. కానీ అది నిష్ప్రయోజనం. ఒక్కరే పరిపూర్ణంగా పరిశుద్ధుడు. ఆయన యేసు క్రీస్తు. ఆయనే ధర్మశాస్త్ర మంతటినీ నెరవేర్చాడు.
దయచేసి గమనించండి, ధర్మశాస్త్రపు గురి ఏమిటో మనము గ్రహించాలి. యేసు క్రీస్తే ధర్మశాస్త్రపు గురి. మనము ఆయనను విశ్వసించినపుడు ఆయన మనకు నీతి అవుతాడు. సోదరీ, సోదరులారా, ఇక వేరే మార్గము లేదు. దేవుని ఈ ఏర్పాటు ఒక్కటే! ఎక్కడైనా, ఎవరైనా, ఈ కులమైనా, మతమైనా, ఏజాతి వారైనా, ఆస్తి అంతస్తు ఏదైనా, ఇదొక్కటే నీతిమంతులుగా తీర్చబడే మార్గము. ఇదే నిజమైన నిర్దిష్టమైన మార్గం.
దేవుని నిత్య సంకల్పంలో ఆయన మనసులో యేసు క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రమునకు సమాప్తి అని నిర్ణయించాడు. మనకు ఆయన సంపూర్ణమైన పరిశుద్ధ్ద్ధమైన బలియాగమే నీతిననుగ్రహిస్తుంది. ఈ సత్యమును జాగ్రత్తగా గమనిస్తున్నారా, శ్రోతలూ? ఉత్సాహం, ఆరాటం మన లోపల ఉంటుంది. అదే మనలను ముందుకు నడిచేలా చేస్తుంది. కానీ అనుభవము లేని జ్ఞానము నిష్ప్రయోజనం. నీ స్వంత ప్రయత్నాలు దేనికీ కొరకావు. మనము దేవుని నీతి పొందడానికి యేసు క్రీస్తు ప్రభువు ద్వారా ఆయన మార్గము ఏర్పాటు చేశాడని విశ్వసించకపోతే అంతా శూన్యం. దేవుని ఈ ఏర్పాటును నీవు ఒప్పుకొని, పరిపూర్ణమైన పరిశుద్ధమైన ఆయన నీతిని పొంది పరలోకంలో స్థానం పొందుతావా? అట్టి కృప సర్వశక్తుడు మనకు అనుగ్రహించుగాక!