#36 రోమీయులకు 20 :
రోమా పత్రిక అధ్యయనం – 20 (6:1-7) క్రొత్త జీవితపు నడవడి, ప్రవర్తన
క్రొత్త జీవితపు నడవడి, ప్రవర్తన
ఒక బోనులో అడవిమృగము అటు ఇటూ తిరుగుతూ ఉన్నట్టే, చాలమంది జీవితాలు ఉంటాయి. పాపo, ఆ జంతువుకు అదే బోనులో ఎన్ని గంటలైనా, రోజులైనా, అటు ఇటూ తిరుగుతూఉండడం తప్ప వేరే ఏమి చేయలేదు. కానీ, మనపట్ల దేవుని ఉద్దేశ్యం అది కాదు. ఆ జంతువు తిరిగినట్టు మనము తిరుగుతూ ఉండాలని దేవుడు కోరడు. కానే కాదు. దేవుడు రెండు మార్గాలున్నాయని స్పష్టపరిచాడు. ఒకటి, విశాల మార్గం, రెండవది, ఇరుకు మార్గం. విశాల మార్గం నాశనానికి దారి తీస్తుంది. మరొకటి, ఇరుకుమార్గం, అది జీవమునకు దారి తీస్తుంది.
యేసుప్రభువు అర్ధించిన రీతిగా నేను కూడా మిమ్మలను ఇరుకు మార్గము ఎంచుకోమని బతిమాలు
తున్నాను. దేవుడు ఈ మార్గముకోసం అన్నీ ఏర్పాటులు చేశాడు, గనుక అందరూ ఈ క్రొత్త జీవితములో జీవించడం సాధ్యమే. దాని గూర్చిన నిర్వచనం, బోధ, అనగా, క్రొత్త జీవితపు నడవడి ఇక్కడ ఇవ్వబడింది. క్రొత్త జీవితము ఎలా జీవించాలో తెలుసుకోవడం సంతోషమే కదా! రోమా. 6:1-7 వరకు చదువుకుందాం, మీ బైబిల్ పెన్ నోట్ బుక్ తెచ్చుకున్నారా? అది ఒక అలవాటు చేసుకొనండి. మనం విన్నది వెంటనే మర్చిపోవచ్చు, కానీ రాసుకున్నది, మళ్ళీ మళ్ళీ చదువుకొని గుర్తు చేసుకోవచ్చు. రోమా. 6:1-7:
1. ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాప మందు నిలిచియుందుమా?
2 అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?
3 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?
4 కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు.
5 మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైనయెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము.
6 ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీనస్వభావము ఆయనతోకూడ సిలువవేయ బడెనని యెరుగుదుము.
7 చనిపోయినవాడు పాపవిముక్తుడనితీర్పుపొందియున్నాడు.
ఈ లేఖనభాగములో మనము క్రొత్త జీవితపు ప్రవర్తన అవలంభించాలని ఆపో. పౌలు కొన్ని బలమైన విజ్ఞప్తులు చేస్తున్నాడు.
మొదటిది, ఆలోచించడానికి వీలుకాని అవకాశం. రోమా 6:1 జాగ్రతగా విని ఆలోచించండి. “ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా?” కృప పాపము చేయడానికి మనకు అనుమతిస్తుందా? ఇదే విషయము గురించి చెప్పబడ్డ మరోమాటను పరిశీలిద్దాం. జాగ్రతగా వింటున్నారా? ఏకాగ్రతతో వినండి. రోమా 5:20-21 “అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను.... పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.” రోమా 6:1లో పౌలు ఎందుకు ఈ ప్రశ్న లేవదీశాడో గమనించారా? పాపము విస్తరించేకొద్ది ఎక్కువగా కృప ఇంకెక్కువ విస్తరిస్తుందికదా అని మనము పాపము ఎక్కువ చేయడం సమంజసమా? ఇది భావ్యమా? తార్కికంగా చూస్తే కొందరికి సబబే అనిపిస్తుంది. అది మన హృదయపు పాపపుస్వభావమును అద్దంపట్టినట్టు చూపిస్తుంది. అందుకే వెంటనే పౌలుగారు “అట్లనరాదు” అంటూఉన్నారు. దీని అసలైన అర్ధం, ‘దేవుడు దాని అనుమతించకపోవుగాక!’ లేదా ‘ఈ విధంగా జరుగకపోవుగాక!’ అవును, కృప విస్తరిస్తుంది కదా అని ఏ ఒక్కరూ పాపములో జీవిస్తూఉండకండి. ఆయన అంటున్న మరొకమాట గమనించండి: “పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?” పాపము విషయములో మనము నిజంగా చనిపోయినట్లయితే, మనము పాపములోనే జీవిస్తూఉండడం అసాధ్యం. ఇదే ఆలోచించడానికి వీలుకాని అవకాశము. క్రొత్త జీవితము జీవించడానికి మనము పౌలు గారి విజ్ఞప్తిని స్వీకరించాలి. అదేమిటంటే, పాపము చేయడానికి కృప మనకు హక్కునివ్వదు.
రెండవది, అధిగమించలేని నిజం. 3వ వచనముప్రకారము బాప్తిస్మము అర్ధమేమిటో పరిశీలిద్దాం. “క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?” ప్రియ స్నేహితుడా, సోదరీ, ఇది ఉట్టిటినేచేసేది కాదు, హృదయపూర్వకమైన బాప్టిస్మమంటే క్రీస్తుతో మరణించడమే! ఇది అధ్యాత్మికమైన అనుభవమన్న సంగతి గుర్తుంచుకోవాలి. విశ్వాసమువలన బాప్తిస్మములో జరిగే ప్రక్రియ ఇది.
క్రీస్తుతో ఐక్యమయ్యేది ఎంతవరకో అర్ధం చేసుకోవడానికి 4వ వచనం పరిశీలించాలి. “మనము బాప్తిస్మమువలన మరణములో పాలుపొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు.” “మరణములో” అనే మాటను లోతుగా ధ్యానిద్దాం. బాప్టిస్మముతీసుకొనుట వలన క్రీస్తుతో మనము మరణించాము. మరణిస్తే పాతిపెట్టబడతాము, పాతిపెట్టబడితే తిరిగిలేచి జీవితులమౌతాము, అటు తరువాత తండ్రి మహిమను పొందుతాము. “కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచు”కోవాలి. ప్రియ మిత్రమా, బాప్టిస్మపు నిజమైన అర్ధమిది. అంచేత విశ్వసిచినవారు క్రొత్త జీవితం జీవిస్తారు. దాని కోసం పౌలు గారు చేస్తున్న విజ్ఞప్తిని స్వీకరించాలి. అదే క్రీస్తుతో ఐక్యపరచబడ్డం, క్రొత్త జీవితమును తెస్తుంది. స్నేహితుడా, సోదరీ, నీ బాప్టిస్మములోని అర్ధమేమిటో గమనించావా?
మూడవది, అర్ధంచేసుకోగలిగిన అంతిమస్థాయి. 5వ వచనములో చెప్పబడిన సత్యమును జాగ్రత్తగా తెలుసుకోవాలి.
“ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైనయెడల, ఆయన పునరుత్థా నముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము.” మరణములో ఐక్యమైతే, పునరుద్ధానములోకూడ ఐక్యమవుతాము. అలాజరిగితే క్రొత్త స్థానములో ఉంటాము. ఇంతకుముందు జీవించినట్టు ఇప్పుడు జీవించము. అప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడము. అప్పుడు ప్రవర్తించినట్టు ఇప్పుడు ప్రవర్తించము.
6వ వచనమును జాగ్రత్తగా గమనిస్తే దేవుడు చేసిన ఏర్పాటు ఏమిటో అర్ధమవుతుంది. “మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీనస్వభావము ఆయనతోకూడ సిలువవేయబడెనని యెరుగుదుము.” దేవుడు చేసిన మహత్తరమైన ఏర్పాటు ఇది. యేసునందలి విశ్వాసము వలన మనము ఆయనతో సిలువవేయబడతాము. ప్రాచీనస్వభావము, అనగా పాపముచేసే నైజము ఇక పనిచేయదు. అప్పుడు మనము పాపపు దాసత్వమునుండి విడుదల పొందుతాము. దేవుని సంపూర్ణంగా సేవిస్తాము. మనలను ఇంతవరకు బంధించిన బంధకాలు తెగిపోతాయి. అప్పుడు పాపము నుండి విడుదల పొందినందుచేత సంతోషిస్తాము. దేవుని స్తోత్రం!
క్రొత్త జీవితము జీవించడానికి పౌలు గారు చేస్తున్న విజ్ఞప్తిని స్వీకరించాలి. క్రీస్తుతో ఐక్యపరచబడుట మనలను పాపపు బంధకాలనుండి విడిపిస్తుంది. ప్రియ నేస్తమా, ఈ విజ్ఞప్తులను నీవు స్వీకరిస్తే, క్రొత్త జీవితం నీదవుతుంది. ఆలోచించడానికి వీలుకాని అవకాశము ఒక విజ్ఞప్తి, రెండవది, అధిగమించలేని నిజం. మూడవది, అర్ధంచేసుకోగలిగిన అంతిమస్థాయి.
నీబ్రతుకుతో నీవు విసికి పోయావా? ఆత్మహత్య తలంపులున్నాయా? చెడు అలవాట్లకు చెడు స్నేహితులకు, పుస్తకాలకు, వీడియోలకు బానిసవయ్యావా? నిరాశపడవద్దు! యేసు క్రీస్తు నిన్ను ఆపాదమస్తకం క్రొత్తవ్యక్తిగా తన పరిశుద్ధాత్మశక్తి చేత రూపాంతరం చెందించగల శక్తిమంతుడు. నీ జీవతపు సారధ్యం ఆయనకివ్వగలవా?