Hope Outreach & Living Hope


సజీవ నీరీక్షణ దైవ సందేశములు
Click on Play button to listen

 
 
Total visitors : 1063
Total views, this Message : 8

#77 రోమీయులకు 4 : 13-18

రోమా పత్రిక అధ్యయనం -15 - అబ్రహాము విశ్వాసము నిజమైనది

మీరంతా బాగున్నారా? ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుందా? మీకే కాదు, దావీదు మహారాజు అని మనము సంబోధించే మన పితరుడు కూడా అనుకున్నాడు. ఎక్కడికీ వెళ్ళవద్దు, పాట వింటూ, బైబిల్, నోట్ బుక్, పెన్ తీసుకొని దేవుని వాక్యం ధానించుదాం, రండి. ఫోన్ కాల్స్, వాట్సప్ మెస్సేజెస్, ఉత్తరాలు, పంపిస్తున్న వారందరికోసం ప్రత్యేకంగా ప్రార్ధిస్తున్నాము. రోమా పత్రిక అధ్యయనాలద్వారా మీరు మేలు, ప్రోత్సాహం, ధైర్యం పొందినట్లయితే, మీ స్నేహితులు, బంధువులతో పంచుకోండి. మీరు ఏ విషయంలో మేలు పొందారో అది మాకు దయచేసి తెలియచేయండి.

వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చేవారిని మనము మెచ్చుకుంటాము కదూ! ఒక వాగ్దానము చేసి వాటిని నెరవేర్చేవారిని మనం అభినందిస్తాము. బైబిల్లో ప్రత్యక్షమయ్యే దేవుడు తాను చేసిన వాగ్దానములను తప్పనిసరిగా నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చని వాగ్దానమును చేయడు. దేవుడు తన వాగ్దానమును నెరవేర్చే విషయంలో అబ్రహాము అద్భుతమైన ఉదాహరణ. రోమా 4:13-18లో దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానము ఎంత నిజమైనదో మీకు చూపించాలని ఆశిస్తున్నాను. లేఖన భాగమును నాతోబాటు మీరు కూడా చందవండి:

13 అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూలముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను.౹ 14ధర్మశాస్త్రసంబంధులు వారసులైనయెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును.౹ 15ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును; ధర్మశాస్త్రము లేనియెడల అతిక్రమమును లేక పోవును.౹ 16ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగలవారికి కూడ దృఢము కావలెనని, కృపననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.౹ 17తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు– ఇందునుగూర్చి18–నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది. ౹ –నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.౹

అపోస్తలుడు విశ్వాసము యొక్క శ్రేష్ట గుణములను నిర్వచిస్తూ ఉన్నపుడు అబ్రహాము విశ్వాసము ఎంత నిజమైనదో తేటగా కనిపిస్తున్నది. ఈ శ్రేష్ఠ గుణములను మీకు నేను వివరిస్తూ ఉండగా నాతో బాటు ఆనందించండి.

వాగ్దానము నిర్దిష్టమైనది. “ అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూలముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను.” 13వ వచనం. నిజముగా ఇది చాలా మహత్తరమైన వాగ్దానము. మనుష్య కుమారుడు తప్ప వేరెవ్వరికీ ఇట్టి వాగ్దానము ఇవ్వబడలేదు. కీర్తన 2:8లో “నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.” అని ప్రకటించబడినది. ఈ మాటలు మనుష్య కుమారునితో చెప్పబడ్డాయి. ఇక్కడ రోమా. 4:13లో బైబిల్ గ్రంధం అబ్రహామును లోకమునకు వారసునిగా చేస్తున్నట్టు సెలవిస్తున్నది. అంచేత దీన్ని మహత్తరమైన వాగ్దానము అని నేనంటున్నాను.

అపోస్తలుడు అబ్రహాము సంతానము గురించి ప్రస్తావిస్తున్నాడు. ఈ మాటలు ప్రత్యేకమైన రీతిలో సంతానమైన యేసు క్రీస్తునకు వర్తించే మాటలు. ఎందుకంటే భూమి మీది సమస్తవంశములు నీ యందు ఆశీర్వదించబడును అని ప్రభువు అబ్రహామునకు వాగ్దానము చేశాడు. ఆది. 12:3. ఇది నిర్దిష్టమైన వాగ్దానము.

వాగ్దానము చేయబడిన సంతానము సినాయి పర్వతము మీద ఇవ్వబడ్డ ధర్మశాస్త్రము మూలాన కాదు. కానే కాదు, ఎందుకంటే అబ్రహామునకు ఇవ్వబడిన ఈ వాగ్దానము సీనాయి పర్వతము మీద దేవుడు మోషేకు ధర్మశాస్త్రము ఇవ్వడానికి 430 సం|| ముందే ఇవ్వబడినది. ఇది సుస్పష్టంగా ఉంది.

ఇక్కడ రోమా. 4:13లో ఆపో. అబ్రహామునకివ్వబడిన వాగ్దానపు శ్రేష్టగుణమును చూపిస్తూ ఉన్నాడు. అది నిర్దిష్టమైనది. అది విశ్వాసపు మార్గము. అబ్రహామునకు సంతానము లేదు గాని ఆయన సంతానము గురించి వాగ్దానము చేయబడింది. అబ్రహామునకు నమ్మడం తప్ప వేరే మార్గము లేదు. అది విశ్వాసము వలన కలిగిన నీతి. ఈ వచనములో “విశాసమువలననైన నీతి మూలముగానే” అనే మాటలను గమనించారా?

దైవికమైన గుణం ఈ నిర్దిష్టమైన వాగ్దానములో వ్యక్తమవుతుంది. అబ్రహాము లోకమునకు వారసుడు అయ్యాడు అంటే అర్ధం ఇదే.

వాగ్దానము భావగర్భితమైనది. 14వ వచనం బోధించే ధర్మశాస్త్రము కంటే విశ్వాసము గొప్పది అనే విషయాన్ని దీర్ఘంగా ఆలోచిద్దాo. ధర్మశాస్త్రం మానవుడు చేయలేని వాటిని ఆజ్ఞాపించింది, ఆజ్ఞాపిస్తుంది. ధర్మశాస్త్రము చేయలేని వాటిని విశ్వాసము చేస్తుంది. ఈ అంశం ప్రాముఖ్యమైంది గనుక మళ్ళీ తెలుసుకుందాం. ధర్మశాస్త్రము చేయలేనివాటిని విశ్వాసము చేస్తుంది. ఎందుకనగా ధర్మశాస్త్రము తీర్పుతీర్చడం తప్ప మరొకటి చేయలేదు. ధర్మశాస్త్రం మనకు ఉగ్రతను తీసుకొచ్చింది. 15వ వచనం ప్రకారం “ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును” అనగా ధర్మశాస్త్రము ఖండిస్తుంది. అపరాధిమీద ధర్మశాస్త్రము దేవుని న్యాయతీర్పును ప్రకటిస్తుంది. ధర్మశాస్త్రము మరణ శాసనమును శాశిస్తుంది, అందుకే “పాపము చేయువాడే మరణము నొందును” అని ధర్మశాస్త్రం ఘోషిస్తుంది. యెహే.18:20.

కానీ విశ్వాసము కనికరమును కోరుకుంటుంది; కనికరమును, క్షమాపణను ఆర్ధిస్తుంది. “ధర్మశాస్త్రము లేనియెడల అతిక్రమమును లేకపోవును,” అంటూ పౌలు దీన్ని 15వ వచనంలో చక్కగా బోధించారు. ఇది సులభంగా కనిపించినా, సత్యమైన సంగతి. ధర్మశాస్త్రము ఇవ్వబడినందుచేత దేవుని పరిశుద్ధ ప్రమాణాలు ఎలా మనమందరము కాల రాశామో, దాన్నిబట్టి ఎంత ఘోర అపరాధం చేశామో మనకు అర్ధమయ్యింది.

లోకమునకు వారసుడు కావడం అబ్రహామనకు ఇవ్వబడిన భావగర్భితమైన వాగ్దానము. అది దేవుని శ్రేష్టమైన గుణం. ఇతర వాగ్దానములన్నిటికంటే ఇది భిన్నమైనది, ఎందుకనగా అది విశ్వాసముపైన ఆధారపడినది.

వాగ్దానము ఖచ్చితమైనది. దేవుని వాగ్దానములు ఖచ్చితమైనవి, మార్పులేనటువంటివి. దేవుడు తాను చేసిన వాగ్దానములు తప్పక నెరవేర్చి తీరుతాడు. 16వ వచనంలో ఉన్నట్టు “కృపననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను” అనగా దేవుని ఈ వాగ్దానము ఆయన కృపద్వారా జన్మించింది. ఇది దేవుని ప్రేమ ప్రవాహము. ఇది విశ్వాసపు సంతానమంతటికీ అనుగ్రహించబడుతుంది. “ఆ వాగ్దానమును యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగలవారికి కూడ దృఢము కావలెనని, కృపననుసరించినదై యుండునట్లు, అది విశ్వాస మూలమైనదాయెను” ఓ! ఇది ఎంత అద్భుతం కదూ! వాగ్దానము ఖచ్చితమైనది. సంతానమంతటికీ అది నిశ్చయమైన వాగ్దానము. విశ్వాసము వలన అబ్రహాము సంతానమైతే మనకు కూడా ఈ వాగ్దానము ఉన్నది. ఇది గొప్ప సంగతి!!

ఇది దేవుని గొప్ప శక్తివలన సాధ్యమయ్యింది. దేవుడు జీవదాత. చనిపోయినట్టు కనిపించే వాటికి జీవమిచ్చే వాడు ఆయనే. లేనివాటిని ఉన్నట్టు పిలవగలవాడు దేవుడే! ఇదే క్రమములో అబ్రహాము గురించి ఆలోచిస్తే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా ఆయన జనములకు తండ్రి అవుతానని దేవుని వాగ్దానమును నమ్మాడు. కానీ ఆ ఖచ్చితమైన వాగ్దానము దేవుని అపరిమితమైన శక్తియందు ముడివేయబడిఉంది. ఆయన ధర్మశాస్త్రపు కర్త, జీవితపు నిర్వాహకుడు, సంరక్షకుడు.

దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? 18వ వచనంలో నీ సంతానము ఈలాగు ఉంటుంది అని చెప్పాడు. దేవుడు చెప్పేది సత్యం. నీవు దాన్ని గట్టిగా నమ్మవచ్చు. నీవిశ్వాసము దానిపైన స్థిరముగా ఉంచవచ్చు. దేవుడు చెప్పినదానిని ఖచ్చితంగా నెరవేరుస్తాడని ధైర్యంగా ఉండవచ్చు. వాగ్దానము ఖచ్చితమైనది, ఎందుకనగా అది దేవుని నమ్మకత్వముమీద ఆధారపడిఉంది. అది దేవుని కృపనుబట్టి నిలుకడగా ఉంటుంది.

ఈ లేఖన భాగము ప్రకారము అబ్రహాము వాగ్దానము శ్రేష్టమైన దైవికగుణములనుబట్టి స్థిరమైనది. వాగ్దానము నిర్దిష్టమైనది. అందులో అనుమానం లేదు. వాగ్దానము భావగర్భితమైనది. అది ఒక్కటే వాగ్దానము ఎన్నో వాగ్దానముల కలయిక కాదు. వాగ్దానము ఖచ్చితమైనది, అందులో ఏ అనుమానము లేదు. దేవుడు అబ్రహామునకిచ్చిన వాగ్దానపు మేళ్ళు మనము ఈనాడు అనుభవిస్తున్నాము. నా స్నేహితుడా, సోదరీ, యేసుక్రీస్తులో ఈనాడు మనకు నిరీక్షణ ఆదరణ ఉన్నవి. దేవుని వాగ్దానములను నమ్మి వాటిని నీ జీవితములో అనుభవించే కృప సర్వకృపానిధిఅయిన దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక!

ప్రార్ధన: నమ్మదగిన దేవా, పరలోకపు తండ్రీ, నీవు ఎంతైనా నమ్మదగినవాడవు. నీ వాగ్దానము నిశ్చలమైనది. నీ అపరిమితమైన కృపనుబట్టి నీకెంతో స్తోత్రము. అబ్రహామునకిచ్చి నెరవేర్చిన మీ వాగ్దానములో మాకు కూడా భాగమిచ్చినందుకు వందనములు. మా విశ్వాసమును మీ వాగ్దానమందు స్థిరముగా ఉంచేలా కృప చూపండి. అబ్రహాము అడుగు జాడలలో నడచుటకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రీ, అమెన్!