#50 రోమీయులకు 34 :
రోమా పత్రిక అధ్యయనం-34 9: 14-24 దేవుని క్రియలకు ఆధారం ఏమిటి?
దేవునికి స్తోత్రం! బాగున్నారా? “సజీవ నిరీక్షణ” ద్వారా మీరు ఏ విధమైన ధైర్యం, హెచ్చరికలు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుతున్నారో తెలియచేయకూడదూ? మీ జీవిత విధానములో మార్పులు కలుగుతున్నాయా? మీ ప్రార్థన అవసరతలు, అంశాలు మాకు తెలియచేయండి. బైబిల్ అనుదినం క్రమo తప్పకుండ చదువుతున్నవారు ఆ విషయం మాకు తెలియచేసినట్లయితే ముగించడానికి ప్రభువు మీకు శక్తి, కృప పట్టుదల అనుగ్రహించాలని మీ కోసం ప్రార్థిస్తాము. ఆ విషయం మాకు తెలియచేయవచ్చు. మా ఫోన్ నంబర్ 8143178111 ఈ ఫోన్లో వాట్సప్ కూడా ఉన్నది. లేదా ఉత్తరం రాయాలనుకుంటే, sms లోగాని, వాట్సప్ లోగాని, మీరు అడ్రెస్ అడిగినట్లయితే అడ్రసు పంపిస్తాo.
కరుణ దేవుని గుణములలో ఒకటి. ఆయన యొక్క నీతి, న్యాయము అనే గుణములమీద అది ఆధారపడి ఉంటుoది. దేవుడు న్యాయవంతుడు కాకపోయినట్లయితే, కరుణించలేడు. ఆయన న్యాయవంతుడు కాబట్టి కరుణ కలిగి ఉండగలడు, కరుణ కలిగి ఉంటాడు. దేవుడు తన అధికారాన్ని చలాయించి తన చేతిక్రింద ఉండే వారిమీద తన ఇష్టమును, చిత్తమును బలవంతంచేసే నియంత, నిరంకుశుడు కాదు. ఆయన మన క్షేమం కోరే శ్రేయోభిలాషి. ఆయన మన మేలును తన మహిమను కోరుకుంటాడు.
దేవుని క్రియలకు ఆధారం ఆయన కరుణ. ఈ పూట దేవుని కరుణ గురించి మనమంతా కలిసి ధ్యానిoచుకుందాం, రండి రేడియోకు దగ్గరగా వచ్చి ప్రశాంతంగా సంతోషంగా కూర్చోoడి. రోమా పత్రిక 9:14-24. ముందుగా ప్రార్ధించుకుందాం, తలలు వంచండి. ప్రార్థన. రోమా 9:14-24
14 కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు.
15 అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడుఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.
16 కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదు గాని,కరుణించు దేవునివలననే అగును.
17 మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని.
18 కావున ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచ గోరునో వాని కఠినపరచును.
19 అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరముమోపనేల అని నీవు నాతోచెప్పుదువు.
20 అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా?
21 ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధి కారము లేదా?
22 ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చ యించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి?
23 మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక,
24 అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?
దేవుడు తన కరుణను చూపించే మార్గాలేమిటో తెలుసుకోవడానికి ఈ లేఖనభాగము అధ్యయనం చేయాలి.
మొదటిది, దేవుడు తన కరుణను తన దయ ద్వారా చూపిస్తాడు. 16వ వచనమును లోతుగా అధ్యయనం చేద్దాం. బైబిల్లో గమనిస్తున్నారా? “ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును” కరుణ అంటే దయ చూపించడం. జాలిచూపి బాధపడడం. దేవుడు మన గురించి బాధపడతాడు, కాబట్టి మనలను కరుణిస్తాడు. మనమీద జాలిచూపిస్తాడు. ఇది ఆయనయొక్క నీతిమంతత్వమును చూపించే పధ్ధతి. 14వ వచనంలో పౌలు “దేవునియందు అన్యాయము కలదా?” అని ప్రశ్నితూ ఉన్నాడు. లేదనే సమాధానం. దేవునిలో అన్యాయం ఎన్నటికీ ఉండనేరదు. దేవుడు తన నీతిని బహిర్గతం చేయడానికి కరుణించడం ఒక మార్గం. ఆయనకు మనలను చూచినపుడు దయ, కరుణ కలుగుతుంది. ఆయన తన కరుణను, దయద్వారా చూపిస్తున్నాడు, దీన్ని తన చిత్తమును బట్టి అర్ధం చేసుకోవచ్చు. 16వ వచనమును జాగ్రతగా పరిశీలించండి. “ పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదు గాని, కరుణించు దేవునివలననే అగును”. ఇది దేవుని కోరికను మనపట్ల ఆయన ఇష్టమును చూపిస్తుంది.
సోదరీ సోదరులారా, దేవుడు తన కరుణను తన దయచేత చూపిస్తాడు. ఆయన హృదయం మన కోసం ఆరాటపడుతుంది. మనము ఎంత నిస్సహాయస్థితిలో ఉన్నామో తెలుసు గనుక మన పట్ల దయతో కనికరం ఆయన చూపుతూ ఉన్నాడు. అవును, అమెన్! దేవునికి మహా స్తోత్రం!!
రెండవది, ఆయన తన శక్తితో మన పట్ల తన కరుణను చూపిస్తున్నాడు. దేవుడు ఇక్కడ చేస్తున్న ఎంపికలు గమనించండి. కాస్త కష్టమేగాని, కొంచెo ధీర్ఘంగా ఆలోచిస్తే ఆపో. పౌలు చెప్పేది బోధపడుతుంది. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు లోనుండి విడిపించడానికి మోషే ను పంపినపుడు అక్కడ ఉన్న రాజు పేరు ఫరో. మీరు దీని విషయం తెలుసుకోవాలంటే బైబిల్లోని రెండవ గ్రంధం నిర్గమ కాండం చదవాలి. ఫరోను ఒక ప్రత్యేక ఉద్దేశ్యముతో దేవుడు నియమించానని సెలవిచ్చాడు. అదేమిటి? తన శక్తిని చూపించడానికి. 17వ వచనం చూడండి: “నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని.” దేవుడు తన శక్తిద్వారా, తన కరుణను చూపిస్తున్నాడు.
ఫరో ఇశ్రాయేలు ప్రజలను వెళ్లనివ్వనని మొండికేశాడు. దేవుడు ఫరోను శిక్షించి, గద్దించి, కఠినమైన తీర్పులు, తెగుళ్లు అతని మీదికి పంపించాడు. కారణం? ఫరో దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశాడు. దేవుడు తన శక్తిని ఉపయోగించడం ద్వారా కరుణా చూపించి ఫరోను అణిచి అతనికి పాఠం నేర్పాడు. ఇశ్రాయేలు ప్రజలను ఫరో తరుముతున్నపుడు దేవుడు ఫరోను ఎర్ర సముద్రంలో ముంచి వేశాడు. ఐగుప్తు రాజుగా ఉన్న ఫరో దేవుని ధిక్కరించినపుడు ఆయన తన శక్తిని చూపించడంద్వారా దేవుడు కరుణించాడని మనము తెలుసుకోవాలి. 18వ వచనం గమనించాలి “ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును.” ఇది వింటున్న మనలో వచ్చే ప్రశ్నలకు ఆపో. పౌలు వద్ద సమాధానముంది. ఇప్పుడు మన
మనసుల్లో మెదిలే ప్రశ్న 19వ వచనములో ఉంది. “అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల?” ‘దేవుడే ఫరోను నియమించి, ఆయనే ఫరో హృదయమును కఠినపరచినపుడు, ఇక ఫరో తప్పేముంది?’ అని ఆలోచిస్తున్నారా? శ్రోతలూ, ఇక్కడ అత్యంత ప్రాముఖమైన సత్యమున్నది. మనకు జవాబు చెప్పే అవసరం దేవునికి లేదు. దేవుడు తన శక్తితో, తన ఉద్దేశ్యం కోసం, తన స్వభావమునుబట్టి క్రియలు చేస్తాడు. మన ప్రశ్నలకు జవాబు చెప్పమని అడిగే అధికారం మనకు లేదు. కాబట్టి గమ నించoడి, దేవుడు తన చిత్తమునుబట్టి తన శక్తి ద్వారా తన కరుణను చూపిస్తున్నాడు, ఆయనకే స్తోత్రం!
ఇక మూడవది, తన ఉగ్రత ద్వారా దేవుడు తన కరుణను చూపిస్తాడు. 22వ వచనం చూద్దాం. “దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ...” నిశ్చయించుకున్నాడు. దేవుని కరుణ, ఆయన న్యాయము, ఆయన నీతి మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకున్నామా లేదా? ఆయన న్యాయము ప్రకారము పాపమును చూస్తూ ఊరకుండలేడు గనుక ఉగ్రత చూపిస్తాడు. దేవుని చట్టము, ఆయన చిత్తమునకు విరోధంగా ప్రవర్తించడం పాపము. దేవుని చట్టమును ధిక్కరించిన ప్రతి ఒక్కరూ ఆయన ఉగ్రతను రుచి చూస్తారు. ఇది సత్యం.
ఆయన తన ఉగ్రత చూపించినా, తన కరుణ చూపిస్తున్నందుచేత మహిమ పరచబడతాడు. 23వ వచనం గమనించాలి. “మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక,….ఆయన పిలిచిన మనయెడల...తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్ననేమి?” అవును, సోదరీ, సోదరుడా, నీలో నాలో ఆయన మహిమపరచబడాలనే ఉద్దేశ్యము దేవునికి ఉన్నది. ఆయన పిలుపు నీవు వింటున్నావా? దేవుడు తన కరుణను నీకు చూపించాలని కోరుతున్నాడు. ఆయన కరుణను తిరస్కరిస్తే ఉగ్రత తప్పదు. ఆయన న్యాయవంతుడు గనుక తిరస్కరించినవారిని విడిచిపెట్టడు. దేవుని కరుణను చులకనగా తీసుకొని, ఉద్దేశ్యపూర్వకంగా తెలిసి తెలిసి, పాపములో ఉండకండి. నీ జీవితమును, హృదయమును బాహాటంగా తెరిచి ఆయన కరుణను నిండారుగా ఆస్వాదించు! దానికి కోసం అవసరమయ్యే కృప ప్రభువు తన కరుణను బట్టి మనకందరికీ అనుగ్రహించుగాక! అమెన్!!