Hope Outreach & Living Hope


సజీవ నీరీక్షణ దైవ సందేశములు
Click on Play button to listen

 
 
Total visitors : 1061
Total views, this Message : 14

#32 రోమీయులకు 12 :

రోమా పత్రిక అధ్యయనం 12 - దేవుడు నీతిమంతునిగా తీర్చినవాడు.

దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
Or send a message by WhatsApp to 98663 41841


ఆదివారం రానేవచ్చేసింది గదూ! ఇది ప్రభువు దినం. దేవుని వాక్యము సజీవమైనది, అనగా జీవముకలిగినది, మాట్లాదేశక్తికలది. కారణం, దానికి మూలం సర్వ సృస్త్తికర్త, పరిశుద్ధుడైన ఏకైక పరమతండ్రి. రండి, దేవుని వాక్యమును పారాయణం చేద్దాం!!

పాపము అనే సమస్య ప్రపంచమంతా ప్రాకిపోయిందని చెప్పడానికి ఏ సందేహము లేదు. పాపమనే సూత్రoతో అందరూ వ్యాధిగ్రస్తులయ్యారు. మనము ఆదాము సంతతి గనుక మనమందరము అలాగే ఉన్నాము. ఆదాము హవ్వ పాపము చేసిఉన్నారు గనుక దాని ఫలితంగా ప్రతి ఒక్కరిలో పాపమనే సూత్రం పుట్టింది.

ఇప్పుడు మన ప్రశ్న ఏమిటంటే పాపము నుండి కలిగే పర్యవసానాలు, ఫలితాలను ఏ విధంగా అరికట్టగలము? పాపమునకు కలిగే న్యాయతీర్పు నుండి ఏ విధంగా తప్పించుకోగలము? కొందరు ఈ విధంగా మరికొందరు ఆ విధంగా జవాబు చెప్తూఉంటారు. పాపము నుండి కలిగే ఫలితలనుండి మనమెలా తప్పించుకోగలము అనే ప్రశ్నకు సమాధానంగా మనము మంచిపనులు, నీతి క్రియలు చేయాలి అంటారు. మనము చేయగలిగిన మంచి పనులు చేయాలి, మనము చెడుపనులు దుష్ట క్రియలు చేస్తూ ఉంటాము గనుక మంచి పనులు చేయడం మంచిదే. కానీ ఈ ప్రశ్నకు ఇది సరియైన సమాధానామా?

మరికొందరు మరో విధంగా ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తారు. నిజాయితీగా ఉండాలి అంటారు. నీవు ఏది చేసినా నిజాయితీగా చేయాలి. ఇది ఈ ప్రశ్నకు నిజమైన సమాధానమా? మరొకరు పాపమునకు కలిగే ఫలితాలనుండి ఎలా తప్పించుకోగలo అనే ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది అనవచ్చు. సమాధానంగా ఏదో ఒక విధంగా తప్పించుకోవచ్చు, ఏదో ఒకటి చేసి ఆ బాధ నుండి బయటికి రావచ్చు, అని అంటారేమో.

నా స్నేహితుడా, సోదరీ? ఈ జవాబులు ఏవి కూడా ఈ ప్రశ్నకు సరియైన సమాధానం కాదు. ప్రశ్న అలాగే ఉన్నది. ఈ జవాబులు కేవలం పైపైన కనపడే రోగలక్షణాలు మాత్రమే తొలగిస్తాయి. మూల సమస్య ఈ జవాబులు తీర్చలేనంత లోతైనది.

పాపము అనే సమస్యకు బైబిల్ సమాధానమిస్తుంది. ఆపో. పౌలు రోమ్ లో ఉన్న క్రైస్తవులకు వ్రాస్తూ ఆయన నీతిమంతునిగా తీర్చే ఒక దేవుణ్ణి నిర్దిష్టంగా చూపించాడు. పాపమునకు కలిగే దుష్పలితాలనుండి ఏ విధంగా తప్పించుకోగలమనే ప్రశ్నకు సమాధానం రోమా. 3:27-31 లో కనిపిస్తుంది.

27. కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయ బడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టి వేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే.
28 కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతి మంతులుగా

తీర్చబడుచున్నారని యెంచుచున్నాము.
29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.

30 దేవుడు ఒక్కడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారిని

విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును.
31 విశ్వాసముద్వారా ధర్మశాస్త్ర మును నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు; ధర్మ శాస్త్రమును స్థిరపరచుచున్నాము.

పౌలు వాదననుబట్టి చూచి, కొన్ని ఖచ్చితమైన ప్రకటనను చేయడానికి నాకు నడిపింపు కలుగుతున్నది. అవి నీతిమంతుని తీర్చే దేవుణ్ణి మహిమపరుస్తాయి.

అతిశయమునకు స్థానము లేదు. ఈ లేఖన భాగములోని మొదటి వచనములో ఈ ప్రశ్న లేవెనెత్తబడింది. “అతిశయకారణ మెక్కడ? అది కొట్టివేయబడెను” అనగా ఆ రోడ్డు మీద రావడానికి వీలు లేదు. క్రియలు అతిశయమును కలిగిస్తాయి, అహమును పుట్టిస్తాయి, అవును, మనుషులు వారు చేసినవాటి గురించి అహంభావం చూపిస్తారు. చాలా సార్లు వారు చేసినవాటినన్నిటినీ జాబితా వ్రాస్తారు, వాటిగూర్చి చెప్తూఉంటారు.

అపోస్టలుడు అతిశయమునకు స్థానము లేదు అంటూ ఉన్నాడు. క్రియల మీద ఆధారపడ్డానికి వీలు లేదు, కానీ విశ్వాసము మీద ఆధారపడవచ్చు. విశ్వాసము క్రియలను కొట్టివేస్తుంది. వాటిని ప్రక్కను నెట్టివేస్తుంది. స్వశక్తి చేత చేసేవి. విశ్వాసము దేవునివైపు చేతులు చాస్తుంది. విశ్వాసము క్రియలపైన ఆధారపడదు. విశ్వాసము దేవుని మీద ఆధారపడుతుంది. దేవునిమీద విశ్వాసముంచిన వ్యక్తి తాను చేసిన క్రియలపైన ఆధారపడడు. కానీ అతడు తన జీవితముకోసం దేవునిమీద ఆధారపడతాడు. విశ్వాసము దేవునిమీద ఆధారపడుతుంది.

ఆజ్ఞలను పాటించడం తప్పుకాదు. దేవుని మీద ప్రేమతో ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తే మంచిదే, కానీ మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి, అనగా పాప క్షమాపణకోసం క్రియలపైన ఆధారపడడం తప్పు. ఎందుకనగా విశ్వాసము క్రియలను అధిగమించి దాటిపోతుంది. అందుచేత గర్వానికి తావులేదు. గర్వము, ఆహoకారము లేనపుడే నీతిమంతునిగా తీర్చే దేవునికి ఘనత!

యూదులు కానివారు ఇందులో చేర్చబడ్డారు. దేవుడు అందరికీ దేవుడని అపొస్తలుడు స్పష్టగా చెప్పాడు. ఆయన కేవలం యూదులకు దేవుడు కాడు, ఆయన యూదులు కానీవారికి కూడా దేవుడు. దేవుడు సార్వత్రికుడు, ప్రపంచమంతటికీ దేవుడు. బైబిల్ లేఖనాల ద్వారా ఆయన యూదులకు తనను ప్రత్యక్షపరచుకున్నాడని మనకు తెలుసు. అది సత్యం. అయినప్పటికీ, ఆయన యూదులకు ప్రత్యక్షమైనంత మాత్రాన యూదులుకాని వారినందరినీ బహిష్కరించలేదు. ఆయన తనంతట తాను యూదులు కాని వారికి కూడా దేవుడుగా ఉండాలని ప్రత్యక్ష పరచుకున్నాడు, ఎందుకనగా ఒక్కడే దేవుడు ఉన్నాడు.

30వ వచనం ఇలా చెబుతుంది: “దేవుడు ఒక్కడే” కాబట్టి దేవుడు ఒక్కడే, మార్గము ఒక్కటే, ఇది ప్రాముఖ్యం. మనసులో స్పస్టంగా గ్రహించండి. యూదులకు దేవుడైన వాడే యూదులు కానివారందరికీ దేవుడు. ఎందుకనగా ఒక్కడే దేవుడు యూదులనైనా, యూదులు కానివారినైనా, నీతిమంతులుగా తీర్చగలడు. సున్నతి అనే మాట యూదులకు వర్తిస్తుంది, సున్నతిలేకపోవుట అనే మాట యూదులు కానివారికి వర్తిస్తుంది.

ఒక్కటే త్రోవ ఉన్నది. అది విశ్వాసమనే త్రోవ. దేవుడు యూదులను విశ్వాసమువలన నీతిమంతులుగా తీరుస్తాడు. యూదులుకాని వారిని కూడా విశ్వాసముద్వారా నీతిమంతులుగా తీరుస్తాడు. ఈ సంగతి మీ మనసుల్లో లోతుగా నాటనీయండి. దేవుడు ఒక్కడే, మార్గము ఒక్కటే. దేవుడు ఒక్కడే కాబట్టి, యూదులు కానివారు, యూదులు కూడా ఇందులో చేర్చబడ్డారు. ఆయన ఏర్పాటు, ప్రణాళికలో నీతిమంతులుగా తీర్చడానికి అందరూ చేర్చబడ్డారు. యూదులు వారి విశ్వాసములో నుండి వస్తారు, యూదులు కానివారు విశ్వాసము ద్వారా వస్తారు. అందరూ విశ్వాసము అనే మార్గములోనే వస్తారు. అవును, దేవునికి స్తోత్రం! యూదులు కానివారు చేర్చబడ్డం చేత నీతిమంతులుగా తీర్చే దేవునికి ఘనత కలుగుతుంది.

ధర్మశాస్త్రము సమాప్తమయ్యింది ధర్మశాస్త్రమునకు దాని ఉద్దేశము ఉన్నది. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవడం ప్రాముఖ్యము. ప్రజలకు వారి పాపములు దోషములు చూపించడానికి ధర్మశాస్త్రము ఇవ్వబడిoది. ఈ అధ్యాయములోని 19వ వచనములో ఆపో. పౌలు ఖచ్చితంగా స్పష్టపరిచిన విషయం ఏమిటంటే ప్రపంచములోని వారందరూ దేవునిసన్నిధిలో దోషులు, నేరస్థులని నిరూపించడానికి ధర్మశాస్త్రము ఇవ్వబడింది. ధర్మశాస్త్రమునకు ఈనాడు కూడా అదే ఉద్దేశ్యము ఉన్నది. దేవుని గురిని మనము ఎక్కడ తప్పామో అది ధర్మశాస్త్రము చూపిస్తుంది. అందుకే దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చాడు. ఆయన అక్కడ తన పరిశుద్ధతను ప్రకటిస్తున్నాడు. పరిశుద్ధ దేవుని ప్రతిబింబం ధర్మశాస్త్రములో కనిపిస్తుంది. అంతే కాదు, ప్రజలు ఆయన అత్యున్నత పరిశుద్ధ ప్రమాణాలను వారి స్వంత ప్రయత్నాలచేత చేరలేమని ధర్మశాస్త్రము చూపిస్తుంది. క్రియలు దాన్ని బహిర్గతం చేస్తాయి.

31వ వచనములో పౌలు ఈ ప్రశ్న లేవదీస్తున్నాడు. “విశ్వాసముద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా?” ఆయన లేదని జవాబు చెపుతూ, నిజానికి దాని ద్వారా ధర్మశాస్త్రమును స్థిరపరుస్తున్నాము అంటూ ఉన్నాడు. ధర్మశాస్త్రము ఖండించి, మరణశిక్ష విధిస్తుంది, విశ్వాసము మట్టుకే విడుదల, నెమ్మదినిస్తుంది. విశ్వాసమునకు మరణశిక్షనుండి విడుదల నిచ్చి మరణశిక్షను ప్రక్కకు నెట్టివేసే శక్తిఉన్నది. విశ్వాసము ధర్మశాస్త్రమును స్థిరపరుస్తున్నది. ఎందుకనగా దేవుడు మనకు ఇవ్వటానికి సిద్ధపడ్డ పాప క్షమాపణను మన క్రియలచేత సాధించలేమని ధర్మశాస్త్రము చూపిస్తుంది.

మొదటినుండి దేవుని ఏర్పాటు విశ్వాసముద్వారా నీతిమంతులుగా తీర్చడమే. కానీ అది ఆ విధంగా చేయడానికి ధర్మశాస్త్రము ఇయ్యవలసి వచ్చింది. దేవుని పరిశుద్ధ ప్రమాణాలను మానవులమైన మనము, స్వంత క్రియల చేత ఎన్నటికీ సాధించలేమని అర్ధం చేసుకోవడానికి ధర్మశాస్త్రం అవసరమయ్యింది. దేవుని పరిశుధ్ధ ప్రామాణికాలు యూదులైనా, యూదులుకానివారైనా అందరూ ఇది గ్రహించడానికి ధర్మశాస్త్రం అవసరమయ్యింది.

కాబట్టి, నా స్నేహితుడా, సోదరీ, ఈ ఖచ్చితమైన ప్రకటనలను జ్ఞాపకముంచుకొని, అర్ధం చేసుకొనండి. నీతిమంతులుగా తీర్చే ఒక్కడే దేవుడున్నాడు. గర్వమునకు అహoభావమునకు స్థానం లేదు. యూదులు కానివారుకూడా ఇందులో చేర్చబడ్డారు, బహిష్కరించబడలేదు. ధర్మశాస్త్రము సమాప్తమయ్యింది. దేవుడు క్షమాపణను అనుగ్రహించి నీతిమంతులుగా తీర్చడానికి అధ్బుతమైన, దివ్యమైన త్రోవ ఏర్పాటు చేసిఉన్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేసిన త్రోవలో నడవడం మొదలు పెట్టవచ్చు. దానికోసం అవసరమైన దైవ కృప, పరిశ్దుద్ధాత్మ సహాయము మనకందరికీ ప్రభువు అనుగ్రహించుగాక!