Hope Outreach & Living Hope


సజీవ నీరీక్షణ దైవ సందేశములు
Click on Play button to listen

 
 
Total visitors : 1036
Total views, this Message : 11

#37 రోమీయులకు 21 :

రోమా పత్రిక అధ్యయనం 21 (6:8-13) దేవునికి అప్పగించుకొనుటలో ఉండే ఆనందం

సజీవ నిరీక్షణ రేడియో కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఎందుకంత నిరాశలో ఉన్నారు? మీ పరిస్థితులు మిమ్మలను కృoగదీస్తున్నాయా? మీకు జరిగిందేదీ దేవుని సెలవులేకుండా జరగలేదు. ఆయన అనుమతి లేకుండా నీ ఒక్క వెంట్రుకకూడా రాలదు. నిన్ను తన అరచేతులో ప్రభువు చెక్కుకున్నానని సర్వాధికారము కలిగిన దేవుడు చెప్పాడు. పాలిచ్చే తల్లి తన చంటిబిడ్డను ఒకవేళ మరచిపోతుందేమో కానీ నేను నిన్ను ఎన్నడూ మరువను అని చెప్పింది సర్వశక్తిగల దేవుడు, సర్వాధికారము కలిగిన సజీవుడైన సృస్త్తికర్త. ఎవరో ఒక మానవుడు కాదు. నీవు ఆయన బిడ్డవైతే ఈ వాగ్దానాలు, ఇంకా మరెన్నో వాగ్దానాలు నీకు వర్తిస్తాయి. లేదంటే, ఇప్పుడు ఈరోజే దేవునితో తెగిపోయిన సంబంధమును తిరిగి కలుపుకోవచ్చు. సుంకరి చేసినది ఒకే ఒక్క వాక్యముతో హృదయ పూర్వకపు ప్రార్ధన: “దేవా, పాపినైన నన్ను కరుణించుము.” వెంటనే ప్రభువు అతణ్ని కుమారుడుగ స్వీకరించాడు. రండి, ఇలా దగ్గరగా వచ్చి కూర్చోండి. పాట వింటూ దేవుని మహిమను గూర్చి తెలుసుకుందాం.

దేవుడు ఆదామును ఒక స్వేచ్చకల్గిన వ్యక్తిగా సృష్టించాడుగానీ, స్వతంత్రునిగా సృష్టించలేదు. కాదు, కానేకాదు, అతడు తనసృష్టికర్త అయిన దేవునితో దగ్గరగాను, ప్రత్యేకమైన రీతిగాను సంబంధంతో ఉండాలని ఉద్దేశించాడు. ఆ ఉద్దేశము పాపమునుబట్టి తెగిపోయింది. ఆదాము తన ఇష్టం వచ్చినట్టు జీవించగలను అనుకున్నాడు. కానీ దానివల్ల కలిగిన ఫలితం దేవునితో సంబంధం తెగిపోయింది.

ఈనాడు చాలామంది దేవుడు లేకుండా జీవిస్తున్నారు. మానవజాతిని దేవుడు సృష్టించిన ఉద్దేశానికి ఇది విరుధ్ధం. దేవునితో సంబంధమును సరిచేసుకొని ఆయనకు వారి జీవితమును అప్పగించుకొన్నవారి జీవితాలు సంతోషంగా, తృప్తికరంగా ఉన్నాయి. లేఖనభాగం రోమా 6:8-13 అధ్యయనం చేస్తూ దేవునికి అప్పగించుకోవడంలో ఉండే ఆనందము ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

8. మనము క్రీస్తు తోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు,

9. మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని నమ్ముచున్నాము.

10. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు

11. అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.

12. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.

13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించు కొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.: ఇది దేవుని పరిశుద్ధ లేఖనం. మళ్ళీ ఈ లేఖన భాగం, లేదా బైబిల్ అధ్యయనo వినాలనుకుంటే, www.sajeevanireekshana.org అనే websiteను దర్శించండి.

దేవునికి అప్పగించుకోవడంలో ఉండే ఆనందమును మీరు అనుభవించడానికి మీరు ఎక్కవలసిన మెట్లు ఏమిటో తెలుసుకుందామా?

మొదటిది, మీరు క్రీస్తుతో కూడా చనిపోయారని గ్రహించి, గుర్తించాలి, ఒప్పుకోవాలి. ఇది విశ్వాసముతో కలిగే అనుభవము. మనము చరిత్రలో తిరిగి వెనుకకుపోయి, ఆయనతో మరణించాలని అర్ధంకాదు. కానే కాదు, ఇది కేవలం విశ్వాసముతో ఆస్వాదించే అనుభవo. క్రీస్తు మనకోసం మరణిoచాడని మనము నమ్మినట్లయితే, మనము ఆయనతోబాటు మరణిస్తాము. 8వ వచనములో దీన్ని మనము గమనిస్తాo. “మనము క్రీస్తు తోకూడ చనిపోయిన యెడల, .... ఆయనతోకూడ జీవించుదుము.” ఇది ఆత్మలో, అంతరంగంలో జరిగే ప్రక్రియ, అనుభవము. ఇది శరీరంలో భౌతికముగా జరిగేది కాదు.

10వ వచనములో ఆయనమరణం జరిగిపోయింది అని స్పష్టమయ్యింది. యేసు క్రీస్తు ప్రభువు సిలువమీద మరణించినట్టు మళ్ళీ ఇక ఎన్నటికీ మరణించడు. అది ఒక్కటేసారి జరిగింది. 10వ వచనంలో “ఒక్కమారే మరణించెను” అనే మాటలు మీ బైబిల్లో గమనించారా? మరణమునకు ఆయన మీద ప్రభుత్వము లేదు. ఈ విషయాన్ని మీ మనసుల్లో నాటనీయండి. ప్రభువు పలికిన “సమాప్తం” అనే శ్రేష్టమైన మాటకు కల్వరి కొండ చెరగని చిహ్నము. ఈ మొదటి అడుగు ముందుకు వేసి నీవు క్రీస్తుతోపాటు చనిపోయావని గుర్తించి, ఈ అనుభవమును విశ్వావమువలన ఆస్వాదించు.

రెండవ మెట్టు, నీవు పాపమునకు చనిపోయావని ఒప్పుకో. మొదటి మెట్టు తరువాత ఈ మెట్టు ఎక్కాలి. ఇది మరణమునుండి జీవమునకు మార్చబడే రూపాంతరపు అనుభవము. 10వ వచనం శ్రద్ధగా గమనించండి, “ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు” హల్లెలుయా! గమనించారా, ఇది మరణములోనుండి జీవములోనికి మార్చబడటం.

పాపమునకు మరణించాలి, దేవునికొరకు జీవించాలి. మనమందరం ఇది గమనించడం, గ్రహించడం, చాలా ప్రాముఖ్యం. యేసయ్య తిరిగి లేచాడు గనుక ఇక మరణించడు. ఆయన నిత్యం, నిరంతం జీవిస్తున్నవాడు, ఆయన జీవించడం దేవునికోసం. కాబట్టి 11వ వచనములోని హెచ్చరిక ఏమిటి? “అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.” మరో మాటలో చెప్పాలంటే, ఈ ఎంచుకొనడం నిరంతరం ఏ మాత్రం ఎట్టి పరిస్థితులలో ఆగకుండా జరుగుతుంది. మన కోసం ప్రభువు ఒక్కసారే మరణించినట్టు ఇది ఒక్కసారి జరిగేది కాదు. ఇది అనుదినం, అనుక్షణం జరగాలి. మనకు అర్ధమయ్యేలా చెప్పాలంటే, “ఎంచుకుంటూ ఉండండి” అని అర్ధం. విశ్రాంతి, విరామం కోరడానికి వీలులేదు. మనలో ప్రతి ఒక్కరము పాపమునకు మరణించామని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి, ఎంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఈ రెండవ మెట్టు కూడా ఎక్కుదామా? నిన్ను నీవే పాపమునకు మరణించావని ఎంచుకో.

ఇక మూడవ మెట్టు, నీ చితశక్తిని దేవునికి అప్పగించుకో. ఆపో. 12వ వచనంలో ఏమని బోధిస్తున్నాడు? “కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.” నీవు గతంలో ఇష్టపడిన నీ దురాశలకు, దుష్టత్వమునకు, పాపపు, నీచపు అలవాట్లకు బానిస కావద్దు. అది వెంటనే ఆపేయండి. అప్పుడు పాపము నీమీద ప్రభువతం చేసి, అధికారము చలాయించింది. ఇప్పుడు కూడా పాపము అలాగే చేయదానికి ప్రయత్నిస్తుంది. కానీ నీవు నీ చితశక్తిని, ఆలోచనాశక్తిని దేవునికి అప్పగించాలి. ఫిలిప్పీ. 4: 8 కంఠస్థంచేసి ఎల్లప్పుడూ ధ్యానించండి. వ్రాసుకుంటున్నారా? సైతానును ఎదిరించు, వానికి చోటియ్యవద్దు. ఇంతవరకు చేసిందే ఎక్కువయ్యింది, ఇక ఆపండి.

ఇక ఏమాత్రం వాటిలో ఉండవద్దు, వెనువెంటనే విడిచిపెట్టి మీ స్వేచ్చనంతటిని ప్రభువునకు అప్పగించండి. వాటన్నిటినుండి నిన్ను నీవు విడిపిచ్చుకొని యేసు క్రీస్తు శక్తిగలిగిన నామములో స్వేచ్చగా ప్రభువు కృపలో మార్పు చెందడం నీవు చేసుకోవలసిన నిర్ణయం!

నీ మనసును ప్రభువునకు అప్పగించుకో, దేవునికి విధేయత చూపించడం, వెంటనే ఆరంభించు. నేను ఈ నిర్ణయం నీ కోసం చేయలేను, నీ కోసం నీవే చేసుకోవాలి, గట్టి, బలమైన పట్టుదలతో నిర్ణయించుకోవాలి. ఆపో. 13వ వచనంలో ఏమని హెచ్చరిస్తున్నాడు? “మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి,….. మిమ్మును మీరే దేవునికి అప్పగించు కొనుడి,” ఇది నీ స్వంతగా, స్వేచ్చగా, పట్టుదలతో చేసుకోవలసిన నిర్ణయం. నీ శరీర అవయములను దేవుని అప్పగించుకో, నీ చేతులు, కన్నులు, చెవులు, నాలుక, నీ పాదములు, అవయములన్నింటినీ దేవునికి అప్పగించుకో. ఈ అవయములన్నింటినీ నీకిచ్చింది ఆయనే! నీవు వాటిని ఆయనకు అప్పగించుకో.

దీని అర్ధం ఏమిటో తెలుసా, ప్రియ సోదరీ, సోదరులారా? నీ చితశక్తిని, మనసును దేవునికి అప్పగించుకోవాలి. నీతికి, అనగా పరిశుద్ధతకు, నీ మనసును, చిత్తశక్తిని, అవయములను సాధనములుగా చేయాలి, వాడాలి. ఇదంతా నీవు నిర్ణయించుకుంటేనే సాధ్యమవుతుంది. ఇక్కడే చాలా క్లిష్టపరిస్థితి. ఈ మూడవ మెట్టు చాలా ప్రాముఖ్యం.

నీ అంతట నీవే దేవునికి అప్పగించుకున్నపుడు నిజమైన ఆనందం పొందగలవు. మూడు మెట్లు తెలుసుకున్నాం కదూ! మొదటిది, నీవు యేసు క్రీస్తు రక్షకునితో బాటు మరణిచాoవని గ్రహించి, నమ్మి, ఒప్పుకో. ఇది విశ్వాసముతో ఆస్వాదించే అనుభవము. రెండవది, నీవు పాపమునకు మరణిచాoవని ఒప్పుకో, ఎంచుకో, ఇది కూడా విశ్వాసముతోనే సాధ్యం. మూడవది, నీ మనసు, చిత్తశక్తిని దేవునికి అప్పగించుకో, ఇది నిర్ణయముతో చేసే సంకల్పం. దేవునికి అప్పగించికోవడంలో అమితమైన ఆనందము దొరుకుతుంది. దీన్నే బైబిల్ “చెప్పశక్యమును, మహిమయుక్తమునైన సంతోషమని” వర్ణిస్తుంది. ఇది నీకు కావాలా? మీకు అధ్యాత్మిక జీవితంలో, సహాయపడడానికి, మీకోసం ప్రార్ధించడానికి, మేము సిద్ధమే, సంకల్పానికి మీరు సిధ్ధమా? మా ఫోన్ నెంబర్: 9866 341 841. మళ్ళీ ఈ అధ్యయనాలు వినాలని ఆశిస్తే, www.sajeevanireekshana.org అనే websiteను దర్శించండి. రోమా పత్రికలోని అధ్యయనాలన్నీ వరుస క్రమంలో ఇదే బ్లాగ్ లేదా వెబ్సైట్ లో అంధుబాటులో ఉన్నవి. మీ బంధువులు స్నేహితులకు, తోటి విశ్వ్వా సులకు పరిచయం చేయండి. మీ ప్రార్ధన అవసరతలు, వాట్సప్, లేదా ఎస్‌ఎం‌ఎస్, లేదా ఫోన్ కాల్ ద్వారానైనా మాకు తెలియచేయండి. ఫోన్ నెంబర్ 9866 341 841.

పరమతండ్రి అయిన దేవుని నిత్య ప్రేమ సర్వకృపానిధి అయిన కృపగల రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, నిత్యమైన అదరణతో నిరీక్షణకర్త పరిశుద్ధాత్ముని తోడు మనకందరికీ తోడుగా ఉండుగాక! అమెన్!!