#39 రోమీయులకు 23 :
రోమా పత్రిక అధ్యయనం 23 7:1-6 -- ధర్మశాస్త్రము యొక్క నియమం
Praise the Lord! Blessed Happy New Year greetings to all of you!! రేడియొ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ, క్రొత్త సంవత్సర శుభములు! 2021 లో బైబిల్ చదవి ముగించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ప్రతి రోజు 3 అధ్య. ప్రభువు దినం 5 అధ్య. క్రమం తప్పకుండా చదివితే ఈ సంవత్సరం ముగింపు వరకు మీరు ముగించగలరు.
ప్రతి దేశానికి పౌరులను క్రమబధ్ధం చేసే చట్టాలు ఉంటాయి కదా! ప్రతి వ్యక్తికి కొన్ని జీవితపు మార్గదర్శకాలు, కట్టుదిట్టాలు ఉంటాయి. మీకు కూడా కొన్ని నియమాలు ఉండవచ్చు. సృష్టిలో కూడా కొన్ని చట్టాలు ఉంటాయి. ఉదాహరణకు, సూర్యుడు. ఎప్పుడు ఉదయించాలో, ఎప్పుడు అస్తమించాలో దాని క్రమం ప్రకారమే ప్రతి దినం అది జరుగుతుంది. సముద్రపు అలలు గడియారపు ముల్లు లాగా, వాటి క్రమం ప్రకారం ఎగురుతూ ఉంటాయి. వాతావరణం, వర్షం, కూడా అలాగే వాటి నియమం ప్రకారం వస్తూ ఉంటాయి. వర్షం కురిసి, నీరు సముద్రాల్లో చేరి, ఎండ వేడిమికి నీరు మేఘాల్లో చేరి మళ్ళీ వర్షం కురుస్తూ ఉంటుంది కదా?
దేవుని సృష్టి నియమాలు, చట్టాలప్రకారం జరుగుతూ ఉంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని నియమాలు ఉన్నవి. పౌలు తాను వ్రాసిన రోమా పత్రికలో ఈ చట్టంగురించి వ్రాశాడు. దీనికి ఆధారం రోమా 7:1-6లో ధర్మశాస్త్రము యొక్క నియమము గురించి విపులీకరించాడు. బైబిల్ తెరిచి చదవండి.
“సహోదరులారా, మనుష్యుడు బ్రదికినంతకాలమే ధర్మశాస్త్రమతనిమీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడు చున్నాను.
2 భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రమునుండి ఆమె విడుదల పొందును.
3 కాబట్టి భర్త బ్రదికియుండగా ఆమె వేరొక పురుషుని చేరినయెడల వ్యభిచారిణియన బడును గాని, భర్తచనిపోయినయెడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివా హము చేసికొనినను వ్యభిచారిణి కాకపోవును. 4 కావున నా సహోదరులారా, మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అనువేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వారా ధర్మశాస్త్రము విషయమైమృతులైతిరి.
5 ఏలయనగా మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై యుండెను.
6 ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొంది తివిు గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము.
ఈ లేఖనములో పౌలు విపులీకరించిన అంశముల ద్వారా ధర్మశాస్త్రము యొక్క నియమము ఏమిటో మనము తెలుసుకుందాం, రండి, రేడియొకు దగ్గరగా వచ్చి నెమ్మదిగా కూర్చొని దేవుని ప్రశస్తమైన లేఖనమును అధ్యయనం చేద్దాం.
మొదటిది, ధర్మశాస్త్రపు నియమాలు, చట్టాలు మనిషి బ్రతికినంతవరకే అతనిమీద అధికారం కలిగిఉంటాయి. బ్రతికిన వారికే చట్టాలు. చనిపోయినవారు చట్టానికి స్పందించరు. అతడు బ్రతినంతవరకే చట్టానికి అతనిమీద అధికారముంటుంది. దీన్ని ఉదహరించడానికి ఆపో. వివాహమును వాడుకుంటున్నాడు. ఒక స్త్రీ తన భర్త బ్రతికిఉన్నంత వరకు ఆయనకు కట్టుబడి ఉండాలి. దేవుని చట్టం ఆ స్త్రీని తన భర్తతో ముడిపెట్టింది. శ్రోతలూ, గమనిస్తున్నారా? ఏ మనుషులు దేవుని చట్టమును మార్చలేవు. దేవుని చట్టం సత్యమైనది. అది నిలుకడగా ఉంటుంది. దేవుని చట్టం ఒక వివాహిత స్త్రీ తన భర్తకు కట్టుబడి ఉండాలని నిర్దేశించింది. భర్త మరణించినపుడే దానినుండి ఆమెకు విడుదల కలుగుతుతుంది. భూమి మీద జీవిస్తున్న వారంతా ఈ చట్టమును గ్రహించి, దానికి విధేయత చూపిస్తే ఎంతో మంచిది, అది చాలా సంతోషం కలిగిస్తుంది.
చట్టం కొన్ని ఆజ్ఞాపిస్తుంది. ఈనాడు ఏ చట్టమైన తన ఆజ్ఞలు పాటించాలని బంధిస్తుంది. దేవుని ఆజ్ఞలు, ధర్మశాస్త్రము మారలేదు. ఈనాడు మానవాళి పైన దేవుని ధర్మశాస్త్రమునకు అధికారమున్నది.
రెండవ అంశం, చట్టo మరణించడం. విడ్డూరంగా ఉందికదూ! జాగ్రతగా వినండి. చట్టమును ఉల్లంఘిచంత మాత్రాన చట్టం మారదు. ఒక స్త్రీ చట్టాన్ని ఉల్లంఘించవచ్చు. వివాహిత అయినప్పటికీ, భర్త జీవించిఉండగా, మరొక పురుషునితో వివాహం చేసుకోవచ్చు. కానీ ఆలాగు చేసినపుడు ఆమె వ్యభిచారిణి అవుతుందని పౌలు బోధిస్తున్నాడు. ఆమె చట్టాన్ని ఉల్లంఘించినంత మాత్రాన చట్టం మారదు గదా! కానీ ఆమె భర్త మరణం ఆమెను విముక్తి చేస్తుంది. అప్పుడు ఆమె మరొకరిని వివాహము చేసుకున్నా, ఆమె వ్యభిచారిణి కాదు.
దీన్ని విశ్వాసులకు అన్వయించుకుంటే ఎలా ఉంటుంది? ఆపో. 4వ వచనములో, “కావున నా
సహోదరులారా, …మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అనువేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వారా ధర్మ శాస్త్రము విషయమై మృతులైతిరి.” అని బోధిస్తున్నాడు. ధర్మశాస్త్రము మరణ శిక్షను విధిస్తుందన్న విషయాన్ని మనము గ్రంహించాలి. యేసుక్రీస్తు ప్రభువు మరణమునుబట్టి మనము ఈ మరణశిక్షనుండి విడుదల పొందాము. మన పాపములకోసం యేసుక్రీస్తు ప్రభువు మరణించినపుడు ఒక విధంగా చెప్పాలంటే, ధర్మశాస్త్రము మరణించిందని చెప్పవచ్చు. విశ్వాసిమీద ఇక ధర్మశాస్త్రానికి ఏ విధమైన అధికారములేదు. ఈ విధంగా ఈ సత్యము విశ్వాసికి అన్వయించబడుతున్నది.
మనమిప్పుడు ధర్మశాస్త్రమునుండి విడుదల పొంది, “వేరొకని” చేరుతున్నాము. ఎవరు ఆయన? మరణమును జయించి తిరిగి సజీవుడైయున్న యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయ! ఎవరైతే మనకు ధర్మశాస్త్రమునుండి విడుదల కలిగించాడనికి మరణించాడో, ఆయనే మరణమును జయించి తిరిగిలేచాడు. ఆయనతో మనము చేరాలి. అనగా యేసు క్రీస్తుతో మనము ఐక్యo కావాలి. ధర్మశాస్త్రము విషయంలో మరణిoచే విషయాన్ని లోతుగా ధ్యానించండి. ధర్మశాస్త్రపు చట్టాన్ని తప్పించుకోవడానికిదే మార్గము! మరణించి తిరిగిలేచిన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి ఆయనతో ఐక్యమైతే తప్ప ధర్మశాస్త్రమునుండి తప్పించుకునే మార్గము లేదు.
మూడవవది, ధర్మశాస్త్రమునుండి విడుదల రక్షించే మార్గము: మనము శరీర స్వభావపు దౌర్బల్యాలు, దాని ఆశలు నెరవేర్చినపుడు ధర్మశాస్త్రము మన అవయములలో పాపపు కోరికలు పుట్టించిoది. దాన్నిబట్టి మరణము అనే ఫలితమును ఎదుర్కున్నాము. వాటివల్ల మరణమే కలిగింది. ఇది ఒక తీర్పు. ఈ సత్యము ఇతర లేఖన భాగములో కనిపిస్తున్నది. “పాపము చేయువాడే మరణము నొందును;” యెహే.18:20. మన శరీరములలో, మనము ఇష్టపడే పాపపు కోరికలు మరణమును కలిగించాయి.
కానీధర్మశాస్త్రం మరణించినందుచేత ఇప్పుడు మనము ధర్మశాస్త్రమునుండి విడుదల పొందాము. యేసు క్రీస్తునుబట్టి విశ్వాసులపైన దానికి అధికారము లేదు. ఒక్కసారి మరణచట్టం అమలు జరిగిన తరువాత ఇక మళ్ళీ చేయనవసరము లేదు. మరో మాటలో చెప్పాలంటే, నేను, మీరు, నాకు, నీకు బదులుగా యేసుక్రీస్తు మరణించాడని నమ్మిన కారణంగా మరణ శాసనం ఇక మన మీద ఉండదు, లేదు. అది మళ్ళీ అమలు జరగదు. ఇది ఎంత అద్భుతమైన సత్యమో గమనిస్తున్నారా, శ్రోతలూ!
ఈ విషయం సరిగ్గా, క్షుణ్ణంగా అర్ధం చేసుకొనండి. దేవుడు బైబిల్లో అనుగ్రహించిన ఈ ప్రణాళికను బట్టి మాత్రమే ధర్మశాస్త్రమునుండి విడుదల పొందగలము. మనము దేవుని ఈ ప్రణాళికను అంగీకరిచక పోయి నట్లయితే, మరణ చట్టం క్రిందనే ఉంటాము. దేవుడు అనుగ్రహించిన ప్రణాళికను అంగీకరించనివారి మీద ధర్మశాస్త్రపు చట్టం అమలులో ఉంటుంది. ప్రియ స్నేహితుడా, సోదరీ, ఏ ఒక్కరూ కూడా దేవుని చట్టమును చెరపలేరు, దానిలో జోక్యం చేసుకోలేరు. అది నిటారుగా ప్రతి ఒక్కరిమీద దాని క్రియ చేస్తూనే ఉంటుంది.
ధర్మశాస్త్రపు ఈ నియమము, చట్టమును గ్రహించండి, దీర్ఘంగా లోతుగా ఆలోచించండి. ఇవి జీవితమంతటికీ సంబంధించినవి. మరణము యేసుక్రీస్తులో ఇప్పటికే సిలువలో జరిగిపోయింది. విడుదల యేసునందు విశ్వాసము ద్వారా ఏర్పాటు చేయబండింది. ప్రభువు తన కరుణతో అనుగ్రహించే ఈ విడుదలను నీవు పొందుతావా, తృణీకరిస్తావా? నిర్ణయo నీదే!