Hope Outreach & Living Hope


సజీవ నీరీక్షణ దైవ సందేశములు
Click on Play button to listen

 
 
Total visitors : 1070
Total views, this Message : 8

#76 2 కొరింధీయులకు 1 : 1-2

సత్య వాక్యమును సరిగా విభజించుట...

శ్రోతలూ, బాగున్నారా? అన్నింటిని మన మేలు కోసం మార్చే ప్రభువు, మన కోసం తన ప్రాణం, రక్తం సర్వస్వం, ధారాళంగా ఇచ్చిన ప్రభువు, పరలోకపు అనంత మహిమలో తండ్రి కుడి ప్రక్కలో కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. “అంతా మన మంచికే” అని చెప్పే అన్యుల నానుడికి రోమా 8:28 లోని లేఖనపు సత్యానికి పొత్తు లేదు. “మంచి” అని చెప్పబడుతున్నదానికి, పరిశుద్ధ గ్రంధములో చెప్పబడిన “మేలు”కు తూర్పు పడమరకు ఉన్నంత దూరమన్న విషయం మీకు తెలుసా? సమస్తమును మేలుకోసం ఆయనను ప్రేమించే వారికి జరిగించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు తన మాట చొప్పున చేయడానికి సర్వాధికారం కలిగిన సర్వశక్తిమంతుడు, సజీవుడు. క్రుంగిపోయినపుడు, భయం, దిగులు, చింత ఆందోళనలు మేఘాల్లగా, మనలను ఆవరించినపుడు కూడా, మనము ఎల్లప్పుడూ బాగున్నట్టే! ఏమంటారు? దేవుని మహా ప్రేమనుండి ఏదీ మనలను వేరు చేయలేదు. హల్లెలూయ!

ఈ దినం నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటారా? రెండవ కొరింథీ పత్రిక అధ్యయనాలు ఆరంభింస్తున్నాము. హల్లెలూయ! ఏ విధంగా ఈ బైబిల్ అధ్యయంన చేస్తున్నామో మీరు తెలుసుకోవాలి. జాగ్రతగా వినండి. ఈనాటి మన అంశం “సత్యవాక్యమును సరిగా విభజించడమెలాగు?” ‘అది మా పనికాదు, బోధకులపని అనుకుంటున్నారా? అది ప్రతి విశ్వాసి, సంఘస్థుడు, యేసయ్య శిష్యుని పని. మీరు బాగా శ్రద్ధగా ఆలకించి మీ ఆలోచన విధానములో మార్పు చేసుకుంటే, మీరు కూడా మీ స్వంత జీవితo, ఇతరుల జీవితాలు నశించిపోకుండా ఉండడానికి సహాయపడగలరు.

“Expository Preaching” అనే ఇంగ్లిష్ మాట మీరెప్పుడైనా విన్నారా? విన్నా, వినకపోయినా, దాని గురించి నేర్చుకుందాం, రండి రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. ఈనాటి ధ్యానాంశం: “సత్యవాక్యమును సరిగా విభజించడం”

యూట్యూబ్ అంతా ప్రసంగాలతో నిండి పోయింది. టి వి. కూడా అంతే. అన్ని రకాల ప్రసంగాలు ఉన్నాయి కాని “Expository Preaching” మట్టుకు ఎక్కడా కనిపించదు, వినిపించదు. అది అన్నిబోధలలో శ్రేష్టమైన వాక్యబోధన. ఎందుకు? దీనిలో లేఖన భాగము మీద కాని, లేఖన భాగము నుండి కాని బోధన జరగదు, కాని లేఖన భాగమునే బోధిస్తాము. ఇది వచనం వెంబడి వచనం, అధ్యాయం వెంబడి అధ్యాయం బోధించినందుకా? కాదు. దీనిలో ఉన్న గుణలక్ష ణాలనుబట్టి దీన్ని వివరణాత్మక, లేఖనపు బోధన అంటారు. “Expository Preaching or Teaching”. ఈ విధమైన బోధనలో అంశములు, అర్ధాలు, ఆంతర్యాలు అన్ని ఎంచుకున్న లేఖన భాగములో నుండి మాత్రమే వస్తాయి.

దీని గుణ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం, రండి, రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. వివరణాత్మక విశ్లేషణాత్మక బోధన ఎలాంటిదో తెలుసుకోవడం సాధ్యమేనా? ముమ్మాటికి. మూడు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే అప్పుడు ఏ గుణలక్షణాలు వివరణాత్మక విశ్లేషణాత్మక ప్రసంగాలకు ఉంటాయో సులభంగా తెలుసుకోవచ్చు.

మొదటి ప్రశ్న, ఎంచుకున్న లేఖనభాగపు చారిత్రక సందర్భము, ఆ భాగమునకు ముందు వెనుక ఉన్న లేఖనపు మాటలకు అనుగుణంగా, పరిశుద్ధ గ్రంధామంతతిలో ఉన్న సారాంశమనకు అనుగుణంగా దాని అర్ధాన్ని చెబుతున్నారా?

పరిశుద్ధ గ్రంధం బైబిల్ లోని సంఘటనలు సరిగ్గా అర్ధం చేసుకోవాలంటే, దాని చారిత్రక నేపధ్యమును అర్ధం చేసుకోవాలి. వ్రాయబడిన సత్యము ఆ దినములలో ఉన్న పరిస్థితులలో ఏ విధమైన రీతిగా ఏ సత్యమును బోధించడానికి ఇవ్వబడిందో అర్ధం చేసుకుంటాము. మనము జీవిస్తున్న ఈ సంస్కృతి, ఆ దినాలనాటి సంస్కృతి చాలా వెరైనది. వివరణాత్మక, విశ్లేషణాత్మక బోధనలో లేఖన భాగము మీద కాని, లేఖన భాగము నుండి కాని బోధన జరగదు, కాని లేఖన భాగమునే బోధిస్తాము. దీని అర్ధం బోధపడాలంటే, జాగ్రత్తగా వినాలి. ఏదైనా లేఖన భాగమును అవగాహన చేసుకోవాలనుకున్నపుడు, దాని వెనుక ఉన్న చారిత్రక నేపధ్యమును గ్రహించవలసి ఉంటుంది. పరిశుద్ధ గ్రంధం వ్రాయబడిన తరముల చారిత్రక నేఫధ్యము ఇప్పుడు మనకున్న చారిత్రకనేఫధ్యము కాదు. దీనికి దానికి చాలా భేదము ఉన్నది. పరిశుధ్ధ గ్రంధం వ్రాయబడినప్పటి సంస్కృతి, జీవన విధానము తెలుసుకోకపోతే, ఆ మాటలను మనము అపార్థం చేసుకునే ప్రమాదం ఉన్నది. అంతే కాదు, అవి వ్రాయబడిన మూల భాష కూడా వెరైనది. ఈ కారణాలనుబట్టి కొందరు పరిశుధ్ధ గ్రంధం ఇప్పటి లోకానికి, తరానికి అర్ధసహితమైనది కాదని కొందరు భావిస్తూ ఉంటారు. ఇది సత్యము కాదు. సంస్కృతి, భాష అప్పటివైనా, దేవుని మాటల్లో ఉన్న సత్యము శక్తి ఎంత మాత్రము తక్కువకాదు. ఈ నాటికి, ఏ నాటికైనా, దేవుని నోటి మాటల్లోని సత్యము మారదు. ప్రతి ఒక్క మాట, పొల్లు, సున్నతోసహా, నెరవేరక మానవు. హల్లెలూయ! మత్తయి 5:18,19.

18. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 19. కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును.”

చారిత్రక నేపధ్యమును గూర్చి ఆలోచించేటపుడు లేఖన భాగము ఏ సంఘటనను వివరిస్తుందో, దానికి చారిత్రక నేపధ్యము ఎంత అవసరమో, గమనించవలసి ఉంటుంది. ఉదాహరణకు యెరూషలేములోని గ్రీకు మాట్లాడే యూద విధవరాళ్లకు ఆహారము విషయములో పక్షపాతము కలిగిందేమో అనే విషయమును తీసుకోవాలి. అది అ. కా. 6వ అధ్యాయములో ఉన్నది. ఈ భాగమును సరిగ్గా అర్ధం చేసుకోవాలంటే దాని చారిత్రక నేఫధ్యమును మొదటిగా అర్ధం చేసుకోవాలి. చారిత్రక నేఫధ్యమును అర్ధం చేసుకోవడము క్రొత్త నిబంధనలోని కొన్ని గ్రంధాల విషయములో ఎక్కువ పాత్ర కలిగి ఉంటుంది. మరి కొన్నింటిలో అది అవసరం లేకపోవచ్చు. అపో. పౌలు కొరింథీ సంఘానికి రాసిన పత్రికలు సరిగ్గా అర్ధం చేసుకోవాలంటే, అప్పటి సాంస్కృతిక చారిత్రక నేఫధ్యం అర్ధం చేసుకోవడం చాలా ప్రాముఖ్యo.

ఏదైనా ఒక లేఖన భాగమును మనము అర్ధం చేసుకోవాలనుకుంటే మనలను మనమే కొన్ని ప్రశ్నలు వేసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు, ఏ సంవత్సరంలో రాయబడింది? వ్రాసినవారు ఏ సందేశము చదువరులకు ఇవ్వాలని ఉద్దేశించాడు? ఆయన వ్రాసిన సందేశం ఆ మొదటి ప్రేక్షకులు ఏమని అర్ధం చేసుకున్నారు? అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఉన్న భేదమేమిటి? ఒకవేళ భేదాలేమి లేవా? కాలాతీతమైన సత్యము, సందేశము ఏమిటి? ఇప్పటి మన జీవితాలకు, పరిస్థితులకు అన్వయింపు ఏమిటి? రెండవ కొరింథీ పత్రికను ఆరంభించే ఈ సమయములో ఈ ప్రశ్నలను వేసుకొని వాటికి సమాధానాలు వెతుక్కోబోతున్నాము.

ఈ క్రమంలో మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదువుకుందాం. 1. దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును 2. కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.”

కొరింథు పట్టణం మొదటి శతాబ్దములో చాలా పేరు గాంచిన ప్రాముఖ్యమైన పట్టణం. అది ఒక రోమీయుల కాలనీ. ప్రవాస స్థానము. అకైయ అనే ప్రాంతానికి ముఖ్యపట్టణం. ఇప్పటి భాషలో చెప్పాలంటే, ఒక రాష్ట్రానికి ముఖ్యపట్టణం. గ్రీసు దేశములో ఎజియన్ సముద్రము, అయియోనియా, అను రెండు సముద్రాలకు మధ్యలో వ్యాపించిన పేలికలాంటిది. అది ఒక కంఠ భూమి. దీని స్థానము చాలా కీలకమైన స్థానము. మీ సైకిల్ లేక మోటర్ సైకిల్, లేదా ఎడ్లబండి చక్రమును ఒక్కసారి ఊహించుకోండి. మధ్యలో ఇరుసు, దానితోబాటు ఉన్న ఆకులు. వీటన్నిటికి ఇరురు ఎంత కీలకమైనదో, కొరింథు పట్టణం ఆ రాష్ట్రానికి అంత కీలకమైనది. యుధ్ధానికైనా, సైన్యపుమొహరింపుకైనా, వ్యాపారానికైనా, కొరింథు పట్టణం అంత కేంద్రoగా ఉండేది. ఈ పూటకు ఈ అధ్యయనం ఇంతటితో ఆపవలసి వస్తుంది. వచ్చే సారి కొరింధు పట్టణం గూర్చి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు తెలుసుకొని కొరింథీ పత్రికల అవగాహనకు ఈ చారిత్రిక నేపధ్యం, భౌగోళిక స్థానం ఎంత కీలకమైనదో మున్ముందు తెలుసుకుందాం. మీకు తెలిసిన వారికి, తోటి సంఘస్థులకు, స్నేహితులకు, బంధువులకు ఈ చక్కటి బైబిల్ అధ్యయనాల గురించి తెలియచెప్పండి. త్వరలో “సజీవ నిరీక్షణ” యూట్యూబ్ ఛానెల్ ఆరంభిస్తున్నాము. ప్రార్థించండి. ప్రార్థన: