#43 రోమీయులకు 27 :
రోమా పత్రిక అధ్యయనం - 27 8:5-13 దేవుణ్ణి సతోషపెట్టడం ఎలాగు?
Praise the Lord! మీకందరికీ ప్రభువు నామంలో శుభములు! ఎంత త్వరగా జనవరి నెల చివరికి వచ్చేశాం కదూ! మీలో ఎందరు క్రొత్త సంవత్సరంలో బైబిల్ చదవడం ఆరంభించారో వారందరినీ అభినందిస్తున్నాను. దేవుని పరిశుద్ధ లేఖనములలో శక్తి, బలము, జీవము, జ్ఞానము, నిరీక్షణ ఉన్నవి. ఇంతవరకు మీ జీవితంలో బైబిల్ గ్రంధం ఒక్కసారి అయిన, సంపూర్తిగా చదవని వారు ఈ రోజైన మొదలు పెట్టండి, క్రమబద్ధంగా ప్రతి దినం 3 అధ్యాయాలు, ప్రభువు దినం 5 అధ్యాయాలు చదివితే, మరుసటి సంవత్సరం ఈ దినానికి మీరు బైబిల్ ముగిస్తారు. గట్టి నిర్ణయo తీసుకొని ఆరంభించండి. అట్టి కృప ప్రభువు మీకనుగ్రహించుగాక!
ఇతరులను తృప్తి పరచడం మనకందరికీ బాగా తెలుసు. తల్లితండ్రులు పిల్లలను, ఒకరిని మరొకరు తృప్తి పరుస్తూ ఉంటారు. ఉద్యోగులు యజమానులను, ఒకరిని మరొకరు తృప్తి పరుస్తూ ఉంటారు. దేవునితో సంబంధం గలవారు ఆయనను తృప్తి పరచాలి. అదెలాగో తెలుసుకోవడానికి ఈనాటి బైబిల్ అధ్యయనం చాలా సహాయ పడుతుంది.
లేఖన భాగం చదువుకుందాం. రోమా 8:5-13.
5. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;
6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.
7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.
8. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.
9. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.
10. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.
11. మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.
12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము.
13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.
దేవుణ్ణి ఎలా తృప్తి పరచగలమో ఆపో. పౌలు నేర్పించే సత్యాలు నేర్చుకుందాం.
మొదటిది, శరీరస్వభావము, దాని పని ఏమిటో పరీక్షించాలి. “శరీరానుసారమైన మనసు” అంటే ఏమిటి? మనoదరిలో ఉండే సహజసిద్ధమైన పాపపు స్వభావము. ఇది 24గంటలు మనతోనే, మనలోనే ఉంటుంది. దాన్నిబట్టి మనము పాపములో జీవించాలనే కోరికతో ఉంటాము. కానీ, ప్రియ శ్రోతలూ, దాని ఫలితం మరణము, లేదా నిత్యనరకం అని గ్రహించండి. 7వ వచనములో గమనించండి, అది దేవునికి వ్యతిరేకమైనది, విరోధమైనది. అంటే ఏమిటి? దేవునితో యుద్ధం చేస్తుంది. దేవునికి లోబడి, విధేయత చూపడం ఇష్టముండదు. 8వ వచనములో చూడండి, వారు దేవుని సంతోషపెట్టలేరు. శరీర స్వభావము లేదా శరీరానుసరమైన మనసు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఎందుకు? మనలోని పాపపు స్వభావము మనలను మనము హెచ్చ్చించుకుంటుంది. జాగ్రత్తగా వింటున్నారా, శ్రోతలూ? శరీరానుసారమైన మనసు అంటే, ప్రాచీన పాపపు స్వభావము దేవుని సంతోషపెట్టలేదు. పరిశుద్ధ గ్రంధం బైబిల్ దీన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. మన పాపపు స్వభావమునకు మరొక పేరు శరీరానుసారమైన మనస్సు. అది దేవునికి విరుద్ధ్ధమైనది. దేవుని సంతోశపెట్టడానికి నేర్చుకొనవలసిన మొదటి బోధన ఇది.
దేవుని సంతోషపెట్టడానికి నేర్చుకోవలసిన రెండవ బోధన, లేక ఆదేశము, అంతరంగంలో నివసించే పరిశ్ధ్ద్ధాత్ముని అధిపత్యమును అనుభవించాలి. ఆధిపత్యం మారుతున్నది. పాపపు శారీరనుసారమైన మనసునకు ఆధిపత్యం, అధికారము లేదు. 9వ వచనము నేర్పుతున్నట్టుగా, “దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.” క్రీస్తు ప్రభువు ఆత్మ లేనివానికి ఆయనకు ఎటువంటి సంబంధం ఉండదు. ఆ వ్యక్తి ఆయనకు చెందినవాడు కాడు. అక్కడితో అయిపోలేదు. అతడిలో లేదా ఆమెలో క్రీస్తు ఆత్మ నివసిస్తున్నపుడు, ఇక వారు పాపపు ప్రాచీన స్వభావపు అధికారమునకు కాదు గాని, ఆత్మకు, అనగా పరిశుధ్ద్ధాత్ముని అధిపత్యానికి, అధికారానికి లోబడి జీవిస్తారు. గమనిస్తున్నారా, శ్రోతలూ? ఆధిపత్యం మారినందుచేత ఇప్పుడు వారు లేదా మీకు అన్వయించుకుంటే మీరు, బోధన, ఆదేశాలు, పాపపు ప్రాచీన స్వభావము నుండి కాదు గాని, దేవుని ఆత్మ నుండి పొందుతారు. అంతరంగంలో నివసిస్తున్న పరిశ్ద్ధాత్ముడు ఆదేశాలు, బోధన ఇచ్చి ఎలా జీవించాలో, ఏమి చేయాలో, దేవుని పరిశుధ్ద లేఖనాలద్వారా బోధిస్తాడు. ఇది అసలైన పరీక్ష. 10వ వచనంలోని “యెడల” అనే మాట మనము “చేత” అనే అర్ధమిస్తుందని గ్రహించాలి. అనగా “ “దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల” అనే దాన్ని”, “దేవుని ఆత్మ మీలో నివసించి యున్నందుచేత” అని చదువుకోవాలి, గ్రహించాలి. “క్రీస్తు మీలోనున్నందుచేత మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.” హల్లెలూయా! ఎంత అద్భుతమైన సంగతి! నమ్ముతున్నారా? ఇందులో ఎలాంటి అనుమానము లేదు. క్రీస్తు మీలో, నాలో ఉన్నందుచేత, ఆ కారణాన్నిబట్టి “శరీరము” అనగా పాపపు ప్రాచీన స్వభావము చనిపోయింది. ఏ విధంగా అని ఆలోచిస్తున్నారా? జాగ్రతగా వినండి. యేసు క్రీస్తు రక్షకుడు సిలువమ్రాను మీద మరణించినందుచేత, ఆయన మన పాపపు ప్రాచీన స్వభావమునకు మరణాన్ని తెచ్చారు. ఆయన మరణమే మన స్వభావాల్లో ఉండే పాపపు నైజమును చంపివేస్తుంది. అప్పుడే, మన ఆత్మ నీతి విషయం జీవమును కలిగిఉంటుంది. దేవుణ్ణి సంతోషపెట్టడానికి పరిశుద్ధాత్ముడు మనలో జీవిస్తాడు. మన అంతరంగములో నివసించే పరిశుధ్ద్ధాత్ముడు దేవుణ్ణి సంతోష పెడతాడు. ఇప్పుడు ఏ విధంగా మనము దేవుణ్ణి సంతోష పెట్టగలమో బోధపడిందా? ఆధిపత్యం మారుతుంది. మీరు, నేను పరిశుధ్ద్ధాత్ముడు ఆధిపత్యం వహించడాన్ని అనుభవిస్తాము. దేవుణ్ణి సంతోష పెట్టె మార్గమిది.
ఇక మూడవ బోధన, లేదా ఆదేశము. చావునకు లోనైన శరీరమును, అనగా పాపస్వభావమును జయించడానికి అభ్యాసం చేయాలి. 11వ వచనం ఎంత ఆశను, ధైర్యాన్ని పుట్టిస్తుంది కదూ! నాతోబాటు బిగ్గరగా ఈ వాగ్దానమును చదవండి: “మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.” హల్లెలూయ! మన దేవుడు ఎంతటి శక్తిమంతుడో, ఎంతగా నిన్ను నన్ను విజయము కోసము ఈ అధ్యయనాల ద్వారా సిద్ధపరుస్తున్నాడో తెలుసుకుంటున్నారా? ఈ అధ్యయనాలను చులకనగా తీసుకోకండి, దేవునికి మీ పట్ల అద్భుతమైన ఉద్దేశ్యమున్నది. అది మిమ్మల్ని విజయవంతులుగా నిలువబెట్టి ఆయన రాజ్యములో వారసులుగా చేయడం. ఆత్మ జీవితం మనలోనికి క్రొత్త జీవన శైలిని సూది మందు ఎక్కించినట్టు ఎక్కిస్తుంది. దాని ద్వారా క్రొత్త అవగాహన, క్రొత్త దిశ, క్రొత్త మార్గము కలిగుస్తుంది. 12 వ వచనం ఏమని బోధిస్తుంది? “కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము.” కానే కాము. ఏమి చేయాలి? 13 వ వచనంలో ఉన్నట్టు “ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.” పరిశుధాత్మ కృప, శక్తి చేత శారీర క్రియలు అనగా పాపపు స్వభావమును “చంపివేయాలి” ఇదే విజయపు రహస్యం! అట్టి రీతిగా చేయుటకు త్రియేక దేవుడు మనకందరికీ సహాయము చేయుగాక! ఆమెన్!