Hope Outreach & Living Hope


సజీవ నీరీక్షణ దైవ సందేశములు
Click on Play button to listen

 
 
Total visitors : 1030
Total views, this Message : 10

#51 రోమీయులకు 35 :

రోమా పత్రిక అధ్యయనం-3 - సువార్త నీకోసమే!

ఒక్కొక్క ప్రజ కోసం ఒక మతం ప్రత్యేకించి ఉందని కొంతమంది భావిస్తారేమో అనిపిస్తుంది. “నా మతం నాకుంది” అని వారు అంటారు. ఒకవేళ నీ మతం నీకుండవచ్చు. అంతే కాదు, కొన్ని దేశాలలో కొన్ని మతాలు పుట్టి ఆ దేశాలలో అభివృద్ధి చెంది ఉండవచ్చు, అక్కడి ప్రజలకు అవి చెంది ఉండవచ్చు. అనేక ప్రజానీకానికి వారి వారి మతాలు ఉన్నప్పటికీ, క్రైస్తవ్యం అందరికోసం ఉంది నేను చెప్పగలను. అవును, ఆమెన్, క్రైస్తవ్యం అందరికోసం ఉన్నది. సత్యవంతుడైన దేవుడు తన కుమారుని మానవ జాతి అంతటి కోసం రక్షకుడుగా ఏర్పాటు చేసినందుచేత ఆయన అది అందరికోసం, అన్నిచోట్ల, ప్రతి ఒక్కరి కోసం చేశాడు. దాన్నిబట్టి సువార్త అందరికోసం అని నేను చెప్పగలుగుతున్నాను. ఆపో. పౌలు రోమీయులకు ఒక ఉత్తరం రాసినపుడు ఆయన సువార్త అందరికోసం అని ఖచ్చితంగా చెప్పాడు.

పరిశుద్ధ లేఖన భాగం రోమీయులకు వ్రాసిన పత్రిక, 1:14-17 గమనించండి. దేవుని మాటలను జాగ్రతగా గమనిద్దాం:
14. గ్రీసుదేశస్థులకును గ్రీసుదేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను.
15. కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను.
16. సువార్తను గూర్చినేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.
17. ఎందుకనిననీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.

ఆపో. పౌలు గారి ఈ మాటలనుండి సువార్త లోని కొన్ని అంశాలను మీకు చూపించాలి. వాటిద్వారా సువార్త నీ కోసమే అని అర్ధం చేసుకుంటావని ఆశిస్తున్నాను. అవును, ఆమెన్!

సువార్త నీ కోసమే అని చూపించే అంశాలలో మొదటిది సువార్త సార్వత్రికమైనది. అంటే ప్రపంచమంతటికీ చెందినది. అది ఒక అప్పు లాంటిది అని పౌలు గారు భావించారు. 14 వ వచనంలో “నేను ఋణస్థుడను” అంటున్నాడు. ఆయనను దమస్కు మార్గమలో యేసు ప్రభువు పిలిచినపుడు పౌలు ఒక ఋణస్థుడయ్యాడు. అక్కడ యేసయ్య ఆయనను కలిసి “నీవు నన్ను ఎందుకు హింస పెడుతున్నావు?” అని అడిగాడు. ఆయన తన హృదయమును ప్రభువునకు సమర్పించిన తరువాత పౌలు ఋణస్థుడయ్యాడు. ఎందుకంటే ప్రభువు ఆ భాధ్యతను పౌలు పైన ఉంచాడు. వెళ్ళి సువార్తను బోధించాలని ప్రభువు ఆయనకు భారము పెట్టినందుచేత ఆపో. పౌలు దానిని ఒక ఋణముగా వించి ఆ భాధ్యతను చేట్టినాడు. ఆయన ఇప్పుడు 14వ వచనంలో “నేను గ్రీసు దేశస్థులకును, గ్రీసు దేశస్థులు కానివారికిని .. ఋణస్థుడను” అంటున్నాడు. అవును, గ్రీసు దేశస్థులకు, ఇంకా గ్రీసు దేశస్థులు కానివారికి కూడా! "జ్ఞానులకును, మూఢులకును”. మరో మాటలో చెప్పాలంటే అందరికీ, ప్రతి ఒక్కరికీ, ఎవరికైనా నేను సువార్త ఇవ్వడానికి ఋణస్థుడను అని చెబుతున్నాడు. పౌలు ప్రపంచమతoటికి తాను ఋణస్తుడనని భావించాడు.

పౌలు జీవించిన కాలంలో ప్రజల మనసులలో కేవలం రెండు రకాల ప్రజలు ఉండేవారు. వారిని గ్రీకులు, గ్రీకు దేశస్థులు కానివారు అని పిలిచేవారు. సమాజంలో అందరికంటే గొప్ప వారు గ్రీకు వారు. మిగతా ప్రజలందరూ వారికంటే తక్కువ వారు. ప్రస్తుతం రెండు రకాల ప్రజలు ఉన్నారు. ఒకవేళ ధనికులు, బీదవారు అనుకోవచ్చు. ఆ దినాలలో జ్ఞానులు, మూఢులు అని పిలిచేవారు. తెలివికలిగిన వారికి, తెలివిలేని వారికి తాను సువార్త ప్రకటించవలసిఉన్నది. ఈ విధంగా గ్రీకులు, గ్రీకులు కానివారు, జ్ఞానులు, మూఢులు, అని చెప్పడంలో పౌలు ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. అందరి విషయం ఆయన భాధ్యతను తీసుకున్నాడు. ఎందుకనగా సువార్త సార్వత్రికమైనది. ఎప్పుడైతే మనము సువార్త సార్వత్రికమైనది అని అంటున్నామో అప్పుడు అందులో నీవు కూడా ఉన్నావు. ఇది నీ కోసమే, మిత్రమా! ఇది ప్రపంచమంతటికీ చెందింది గనుక ఎవ్వరూ విడిచిపెట్ట బడలేరు. ఆయన “గ్రీకు దేశస్థులకును, గ్రీకు దేశస్థులు కానివారికిని, జ్ఞానులకును, మూఢులకును నేను ఋణస్థుడను” అని చెప్పినందుచేత ఈ విషయమును అపో. పౌలు ఖచ్ఛితoగా తేటపరుస్తున్నాడు. సువార్త నీ కోసమే అనే దానిలో రెండవ అంశము అది ముఖ్యమైనది, విశేషమైనది . ఆపో. పౌలు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు, ఆయన స్వంత మాటల్లో చెప్పాలంటే, “నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్తప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను” అది ప్రత్యేకమైనది, విశేషమైనది. పౌలు తన సంసిద్ధతను తెలియచేశాడు. నేను దేవునితో వివాదం పెట్టుకోలేను. నోటిమాట గాని, బోధించడం గాని, దేవుడు ఏర్పాటు చేసిన సువార్తను బోధించే విధానమని బైబిల్ అతి స్పష్టంగా చెబుతుంది. నేనిప్పుడు మీతో చేస్తున్నది అదే! నేను మీకు ఇప్పుడు సువార్త బోధిస్తున్నాను. నేను ప్రస్తుతం మీతో నోటిమాట ద్వారా చేస్తున్నాను. మీరు చదువుతున్న ఈ మాటలతో మీదగ్గరికి వచ్చాను. అప్పుడు పౌలు ఇదే చేయడానికి సిధ్ధంగా ఉన్నానన్నాడు . “రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను” అన్నాడుగదా! అంటే దీనిని ప్రత్యేకమైన విశేషమైన సువార్త ప్రకటనగా చేశాడన్నమాట! ఆయన రోమ్ లోని ప్రజల పట్ల ప్రత్యేక శ్రధ్ధ చూపినాడు.

పౌలు దినాలలో రోమ్ ఎలా ఉండేదో ఇప్పుడు మీకు వివరించాలనుకుంటున్నాను. పౌలు దినాలలో రోమ్ ఎలాగుండేది? ఎలాంటి పట్టణం? ఓ, అది చాలా పెద్ద ముఖ్యమైన పట్టణం సుమా! రోమా సామ్రాజ్యానికి ముఖ్యపట్టణం. ఆనాటి నాగరిక సమాజానికి, రోమా సామ్రాజ్యానికంతటికీ అదే ముఖ్య పట్టణం అనిచెప్పవచ్చు. ఆ దినాలలో అన్ని మార్గాలు రోమ్ పట్టణం చేరతాయి అనే నానుడి ఉండేది. “All Roads Lead to Rome” అనే ఇంగ్షీషు సామెత అప్పుడే పుట్టింది. అంతే కాదు, రోమాచక్రవర్తి కుటుంబము, వారి పరివారము అంతా అక్కడే నివసించేవారు. అధికారులు, రాజరికపు కుటుంబాలు, అందరూ రోమ్ లో నివసిoచేవారు. అది వ్యాపారానికి కేంద్రం, రాజకీయాలకు కేంద్రం, మతానికి కూడా కేంద్రం. రోమా సామ్రాజ్యమoతటికీ అదే ముఖ్యమైన పట్టణం. వారంతా సువార్త వినవలసినవారని ఆయన భావించాడు. ఇతరులకు ఆయన సువార్త అందించినట్టే వీరికి కూడా సువార్త బోధించాలనుకున్నాడు. అంటే సువార్త ప్రత్యేకమైనది, విశేషమైనది. సువార్త ప్రత్యేకమైనది, విశేషమైనది, అన్నప్పుడు, అది నీకు కూడా ప్రత్యేకమైనది, వ్యక్తిగతమైనది.

సువార్త నీ కోసమే అనే దానిలో మూడవ అంశము అది వ్యక్తిగతమైనది.“సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడనుకాను” అని ఆపో. పౌలు అన్నారు. పౌలు దినములలో కొందరు సువార్తను హేళన , ఎగతాళి చేసిఉండవచ్చు. కొందరు సువార్తను దూషించి ఉండవచ్చు. "ఓ, సువార్తతో నాకేమీ అవసరం లేదు" అన్నవారు ఉండవచ్చు. కానీ అపొస్తలుడు తెలుసుకున్న విషయం ఏమిటంటే సువార్త తన జీవితాన్నే మార్చివేసింది. తాను ఎలా మునుపు జీవించాడో ఆయనకు బాగా తెలుసు. ప్రస్తుతం ఆయన ఎలా జీవిస్తున్నాడో అది కూడా ఆయనకు బాగా తెలుసు. నిజానికి, ఆయన ఒక ఇతర పత్రికలో “ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి” అని బోధించారు. క్రీస్తు ద్వారా నూతన సృష్టిగా క్రొత్త వ్యక్తిగా మార్చబడడంలో సిగ్గుపడేదేమీ ఉండదుగదా! క్రీస్తు సువార్తను గురించి తాను సిగ్గుపడడం లేదని పౌలు ఎందుకు అన్నాడంటే, “రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి”. ఆ శక్తి తన స్వంత జీవితంలో ఏమి చేసిందో ఆయన తెలుసుకున్నాడు. అది ఆయనను రక్షించి మార్చిన దేవుని శక్తి. అది ఎలాంటిదో 16 వ వచనంలో ఉన్న మాటలలో వివరిస్తున్నాడు: “నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది” ఇంకా చూస్తే, ఆయన 17 వ వచనంలో సువార్త దేవుని నీతి యొక్క ప్రత్యక్షత, లేదా ప్రకటన అని చెబుతూ ఉన్నాడు. నేను మరొక మాట చెప్పాలి, అది మానవుని పాపమును కూడా ప్రకటిస్తుంది. ఆపో. పౌలు దేవుని ఆ శక్తిని రుచి చూచిన వ్యక్తి. అది ఆయనకు వ్యక్తిగతమైన సువార్త. అది నీకు కూడా వ్యక్తిగతమైన సువార్త అని పౌలునకు తెలుసు. ఎందుకంటే,ఆయన 16 వ వచనంలో అంటున్నాడు. “నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది”

ఓ దేవునికి స్తోత్రం! ప్రియ మిత్రమా! ఇప్పుడే నేను నీకు చెప్పగలను, సువార్త వ్యక్తిగతమైనది, కాబట్టి అది నీకు కూడా! నమ్మి విశ్వసించి గ్రహించే ప్రతీ ఒక్కరికీ కూడా! దేవునికి స్తోత్రం, ఇది ఇంత వ్యకిగతమైనది! కాబట్టి, మిత్రమా, సువార్త నీ కోసమే, ఎందుకంటే అది సార్వత్రికమైనది, ప్రపంచమంతటికీ చెందింది. కాబట్టి అందులో నీవు కూడా ఉన్నావు. అది ప్రత్యేకంగా నీ కోసం, నీతో ఉన్న ఇతరులకు కూడా. నీవు నమ్మినట్లయితే ఇది నీకు వ్యక్తిగతమైనది. దేవునికి స్తోత్రం!

ప్రార్ధన: పరిశుద్ధుడా, ప్రేమ గలిగిన తండ్రీ, సువార్తను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము. పౌలు జీవితమును మార్చిన సువార్త మా అందరి జీవితాలను మార్చుటకు శక్తిగలిగనది. నా జీవితమును సువార్త శక్తిచేత మార్పు చెందించoడి. ఇంతవరకు సువార్తను విన్న ప్రతి ఒక్కరూ మీ శక్తి చేత మార్చబడుటకు కృప చూపించుమని క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రీ, ఆమెన్!